Rahul Gandhi : కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) తనపని తాను సక్రమంగా చేయడం లేదని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం తీరు భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా ఉందని ఆయన అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు.
ఒక మనిషి, ఒక ఓటు అనేది రాజ్యాంగానికి భూమిక అని రాహుల్‌గాంధీ అన్నారు. ఒకరికి ఒక ఓటు అనే అంశాన్ని ఈసీ తుంగలో తొక్కిందని విమర్శించారు. ఈసీ తీరుతో రాజ్యాంగానికి విఘాతమని, తాము రాజ్యాంగాన్ని కాపాడుతూ వస్తున్నామని చెప్పారు. ఒకరికి ఒక ఓటే ఉండేలా చూసే బాధ్యత ఎన్నికల సంఘానిదని, కానీ ఎన్నికల సంఘం తన బాధ్యతను సక్రమంగా నెరవేర్చడం లేదని ఆరోపించారు.
దుష్టశక్తుల బారినుంచి తాము రాజ్యాంగాన్ని కాపాడుతూ వస్తున్నామని, ఇక ముందు కూడా రాజ్యాంగాన్ని కాపాడుతూనే ఉంటామని రాహుల్‌గాంధీ చెప్పారు. ఎన్నికల సంఘం అవకతవకలకు పాల్పడుతున్న తీరుపై గతంలో తమ దగ్గర రుజువులు లేవని, ఇప్పుడు రుజువులు ఉన్నాయని అన్నారు. రాజ్యాంగ పరిరక్షణలో వెనకడుగు వేసే సమస్యే లేదని వ్యాఖ్యానించారు.