న్యూఢిల్లీ, మార్చి 7: ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్..రుణ గ్రహీతలకు శుభవార్తను అందించింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ను 10 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఈ తగ్గింపు శనివారం నుంచి అమల్లోకి వచ్చిందని పేర్కొంది. బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఒక్కరోజు నుంచి మూడేండ్ల లోపు కాలపరిమితి కలిగిన రుణాలు మరింత చౌకగానున్నాయి. దీంతో బ్యాంక్ ఎంసీఎల్ఆర్ రేటు 8.15 శాతం నుంచి 8.55 శాతం లోపు దిగొచ్చాయి. అంతకుముందు ఇది 8.25 శాతం నుంచి 8.60 శాతం లోపు ఉండేది. దీంతో ఎంసీఎల్ఆర్తో అనుసంధానమైన రుణాలపై వడ్డీరేట్లు మరింత తగ్గనున్నాయి.
ఎఫ్డీలపై వడ్డీ పెంపు
డిపాజిట్దారులకు కూడా బ్యాంక్ ఊరటనిచ్చింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటును 10 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్టు ప్రకటించింది. దీంతో డిపాజిట్లపై బ్యాంక్ వడ్డీరేటు 2.75 శాతం నుంచి 6.50 శాతం వరకు సాధారణ ఖాతాదారులకు చెల్లించనుండగా, సీనియర్ సిటిజన్లకు 3.25 శాతం నుంచి 7 శాతం లోపు చెల్లించనున్నది. అలాగే మూడేండ్ల నుంచి నాలుగేండ్ల ఏడు నెలల్లోపు కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై వడ్డీరేటును 10 బేసిస్ పాయింట్లు సవరించింది. దీంతో డిపాజిట్లపై వడ్డీరేటు 6.40 శాతం నుంచి 6.50 శాతానికి పెరిగింది. రూ.3 కోట్ల లోపు టర్మ్ డిపాజిట్లకు మాత్రమే పెరిగిన వడ్డీరేటు వర్తించనున్నదని పేర్కొంది.