నీలగిరి, జూలై 27 : నల్లగొండలోని ఓ పాత ఇనుప సామాను దుకాణంలో బ్యాలెట్ బాక్స్ కనిపించడంతో కలకలం రేగింది. సాధారణంగా ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం సంబంధిత అధికారుల పర్యవేక్షణలో బ్యాలెట్ బాక్స్‌లను స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరుస్తారు. స్ట్రాంగ్ రూమ్‌లో ఉండాల్సిన బ్యాలెట్ బాక్స్ పాత ఇను ప సామాను దుకాణంలో ప్రత్యక్షం కావడంతో అధికారుల చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతోంది. అది కూడా ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాకుండా జిల్లా కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో లభ్యం కావడం చర్చనీయాంశంగా మారింది. కలెక్టరేట్‌కు సమీపంలోని ఓపాత ఇనుప సామా ను దుకాణంలో తెలంగాణ ఎన్నికల సంఘానికి చెందిన ఈ బాక్స్ కనిపించడం పలు అనుమానాలకు తావిస్తోంది. బాక్సుపై ఉన్న టీఎస్ ఈసీ జేఎస్ బీపీ అక్షరాలను పరిశీలిస్తే ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన బ్యాలెట్ బాక్సుగా అధికారులు అనుమానిస్తున్నారు.
గత మూడు రోజుల క్రితం ఎవరో వ్యక్తి దుకాణ దారుడికి రూ. 150 లకు దీనిని విక్రయించినట్లు తెలిసింది. ఈ విషయమై సమాచారం అందుకున్న నల్లగొండ టూటౌన్ ఎస్సై సైదాబాబు బ్యాలెట్ బాక్సు స్ట్రాంగ్ రూమ్ నుంచి ఎలా బయటకు వచ్చింది? ఎన్నికల సంఘం అధికారికంగా పాత సామాను కింద వేలం వేసిందా? లేక మరే ఇతర మార్గంలో బయటకు వచ్చిందా? అనే కోణంలో విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనతో ఇలాంటి బ్యాలెట్ బాక్సులు మరెన్ని బయటకు వచ్చాయో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, బాక్సును కట్టర్‌తో కోసిన ఆనవాళ్లు కూడా ఉండటంతో మరిన్ని అనుమానాలు వస్తున్నాయి. ఈ విషయమై దుకాణ యజమానిని ప్రశ్నించగా.. మూడు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తి సదరు బాక్సును తనకు విక్రయించాడని చెప్పినట్లు సమాచారం.