తిరుమలగిరి జూలై 27 : ఆరుగాలం కష్టపడి పనిచేసే అన్నదాతలకు అన్నీ కష్టాలే ఎదురవుతున్నాయి. ఒక వైపు ప్రభుత్వాలు పట్టించుకోక పోవటం.. మరో వైపు కాలం కలిసి రాకపోవడంతో రెండు విధాలుగా రైతులు నష్టపోతున్నారు. కాల్వల ద్వారా సాగునీరు అందించటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలను ప్రభుత్వం సిద్ధం చేస్తున్నా రైతులు ఆసక్తి చూపటం లేదు. గత సంవత్సరం మొం థా తుపాను కారణంగా చేతికందిన పంట నష్టపోగా ఈ సారి ఎల్నినో ప్రభావంతో సాగు భూములు బీళ్లు గా మారాయి. ప్రస్తుత వానకాలంలో జిల్లా వ్యాప్తంగా లక్షల ఎకరాలు బీడు భూములుగానే మారే అవకాశం ఉం ది. ఒక్క వంతు సాగైతే, మూడు వంతులు బీడు భూములుగా మిగిలే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కరువు ఛాయలను తట్టుకునేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టినా రైతులు మాత్రం ఆసక్తి చూపటం లేదు. దీనికి ప్రధాన కారణం బలమైన కార్తెలు అసలేరు, మఖ, పుబ్బ ఉన్నాయనే ఆశ . ఈ కార్తెల్లో వర్షాలు కురిస్తే వరి సాగు చేయాలని రైతులు ఆశతో ఎదురు చూస్తున్నారు. వరి సాగు కోసం ఆగస్టు చివరి వరకూ వేచిచూసే ధోరణిలో ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా వరి సాధారణ సాగు 6,20 లక్షలు కాగా ప్రస్తుతం 46 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగైంది. వర్షాలు కురిసినా మరో లక్ష ఎకరాలకంటే ఎక్కువ సాగయ్యే అవకాశం లేదు. ఆరు తడి పంటలు సాధారణంగా లక్ష ఎకరాలకు పైగా సాగు కావాలి. కానీ ఈ సారి 10 వేల ఎకరాలను మించే పరిస్థితి లేదు. ప్రస్తుతం 2 వేల ఎకరాలు మాత్రమే ఆరుతడి పంటలైన కంది ,పెసర, వేరుశనగ సాగయ్యాయి.
జిల్లాలో ప్రధాన పంట వరి కావటంతో రైతులు ఇంకా వరిపైనే ఆశలు పెట్టుకున్నారు. ఆగస్టు ముగిసే నాటికి వర్షాలు పడితే వరి సాగు చేయాలనే ధోరణిలో రైతులు ఉన్నారు. ఒక వేళ వర్షాలు పడకుంటే మొక్కజొన్న, జొన్న సాగు వైపు దృష్టి సా రించే అవకాశం ఉంది. గత సంవత్సరం జిల్లా వ్యాప్తంగా 5 వేల ఎకరా ల్లో రైతులు మక్కలు సాగు చేసారు. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో క్వింటా రూ. 2400 ధర పలికింది. ఈ క్రమంలో వర్షాలు పడకుంటే 30వేల ఎకరాలకు పైగా మొక్క జొన్న సాగయ్యే అవకాశం ఉంది. అదే విధంగా 10 వేల ఎకరాలకు పైగా జొన్న సాగయ్యే అవకాశం ఉంది.
పరి కోసం వేసిన నారు ముదురుతోంది. కొన్ని చోట్ల నారు కూడా ఎండుతున్న సందర్భాలు ఉన్నాయి. వానకాలం కలిసి వస్తే పెద్ద ఎత్తున వరి సాగు చేయాలనే ఆశతో ఈ సారి ముందస్తుగానే రైతులు నారు వేశారు. కానీ కాలం కలిసి రాక నారు ముదురుతున్నది. ముదిరిన నారుతో వరి దిగుబడి కూడా తగ్గే అవకావం ఉందని రైతులు చెబుతున్నారు.
ఈ సారి రైతులు పత్తి వైపే మొగ్గు చూపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 7,29,083 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా గత సంవత్సరం 1,25,162 ఎకరాల్లో పత్తి సాగు చేస్తే ప్రస్తుతం 81,607 ఎకరాల్లో సాగు చేశారు. పత్తి చేతికి అందుతుందా లేదా అనే అనుమానం కూడా రైతులను వెంటాడు తున్నది. ప్రతీసారి పత్తి రైతులకు అనావృష్టి ,అతి వృష్టి పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీనితో పత్తి రైతులు నష్టాల పాలవుతున్నారు. వర్షాలు వస్తాయనే గ్యారెంటీ లేక పోవటంతో రైతుల్లో ఆందోళన కనిపిస్తోంది.

రెండేళ్ల సంది రైతులు గోస పడుతున్నారు. కాలం కలిసొస్తలేదు. పోయిన సంవత్సరం మొంథా తుపానుతో చేతికందిన పంట నీళ్ల పాలై నిండా మునిగినం. ఈసారైనా కాలం అయితే బాగు పడతాం.. అనుకుం టే ఎల్నినో కారణంతో కరువు వచ్చి పడింది. బోర్లు ఎండినయి. నార్లు ఎండి పోతున్నయి. బావులు దగ్గరకు పోతే బాధేస్తున్నది. పంటలు సాగు చేసుకుంటేనే రైతులకు వ్యవసాయం చేసినట్లు ఉంటుంది. మొత్తం పడావుపడి ఉంది. బోర్లు వేస్తే పడతలేవు. భూమిల జల అస్సలే లేదు.
బోరు కొద్దో గొప్పో నీరు అందిస్తుందని మూడెకరాలు వరి సాగు చేసిన. ప్రస్తుతం భూగర్భ జలాలు అడుగంటడంతో ఆగి పోస్తున్నది. పరిస్థితి ఇట్లనే ఉం టే 15 రోజుల్లో వరి పొలాలు నెర్రెలు వారుతయి. ఇప్పటికే ఎకరానికి 15 వేలకు పైగా పెట్టుబడి పెట్టినం. మూడెకరాలకు 50 వేలకు పైగా పెట్టుబడి పెట్టినం. గతంలో ఆగిపోసే బోర్లు వర్షాకాలంలో నిండుగా నీళ్లు అందించేవి. కానీ ఇప్పుడు నీళ్లు పోసే బోర్లు కూడా ఎండుతున్నయి. మరో పదిహేను రోజు లు వర్షాలు లేకుంటే ఆగిపోసే బోర్లు కూడాఎండపోతాయి. చాలా మంది రైతుల పొలాలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది.