ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 19 : ఒకే పాఠశాలకు చెందిన ఐదుగురు ఉపాధ్యాయులు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందడంతో జిల్లాకే మన పాఠశాల ఆదర్శం అయ్యిందని ఏదులాపురం మున్సిపల్ చైర్ పర్సన్ పోకబత్తిని అనిత అన్నారు. శనివారం మున్సిపాలిటీ పరిధిలోని జలగం నగర్ ఉన్నత పాఠశాలలో నో బ్యాగ్ డే కార్యక్రమం జరిగింది. అనంతరం స్థానిక కౌన్సిలర్ బోయిన కృష్ణకుమారి అధ్యక్షతన ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చైర్పర్సన్ పి.అనిత ఇటీవల జిల్లా స్థాయిలో గురుపూజోత్సవం సందర్భంగా ఉత్తమ అవార్డులు పొందిన పాఠశాల హెచ్ఎం శాంసన్ తో పాటు మరో నలుగురు ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒక్క పాఠశాల నుంచి ఐదుగురు ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు పొందటం అరుదైన సంఘటనగా ఆమె పేర్కొన్నారు.
ప్రస్తుతం పాఠశాలలో 400 మంది విద్యార్థులు ఉండటం సాధారణ విషయం కాదన్నారు. ప్రభుత్వ పాఠశాలలపై ఇంత నమ్మకం పెంచే విధంగా కృషి చేస్తున్న ఉపాధ్యాయుల కృషిని అభినందించారు. పాఠశాలపై నమ్మకంతో పిల్లలను సర్కారు బడికి పంపిస్తున్న తల్లిదండ్రులను ప్రశంసించారు. పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారం ఎప్పటికీ ఉంటుందని భరోసా కల్పించారు. రాష్ట్రస్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా అత్యుత్తమ ఫలితాలు విద్యార్థులు సాధించే విధంగా రెట్టింపు ఉత్సాహంతో విద్యను అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు ఆదిలక్ష్మి, రాజిదా బేగం, చీనియ, షాబుద్దీన్, ఎస్ఎంసి చైర్ పర్సన్ విజయలక్ష్మి, కాలనీ పెద్దలు, వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.