గౌతంపూర్, సెప్టెంబర్ 19 : గ్రామంలో కోతులు, కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదంటూ గౌతంపూర్ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ కళ్యాణి, కార్యదర్శి షర్మిలను నిలదీశారు. కోతులు, కుక్కలను పట్టుకోవాలని డీపీఓ ఆదేశించినప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. దీనిపై సర్పంచ్, కార్యదర్శి మాట్లాడుతూ పంచాయతీలో జనరల్ ఫండ్ లేకపోవడంతో కోతులు, కుక్కలను పట్టించేందుకు నిధులు లేవని తెలిపారు. కేంద్ర నిధులను ఈ పనులకు వినియోగించేందుకు అవకాశం లేదని ఉన్నతాధికారులు తెలిపారన్నారు. ఈ విషయంపై సర్పంచ్ కళ్యాణి ఎంపీడీవో సుభాషిణిని ఫోన్లో సంప్రదించగా సింగరేణి నుండి జనరల్ ఫండ్ తెప్పించుకోవాలని, జనరల్ ఫండ్ అందుబాటులో ఉంటే కోతులు, కుక్కలను పట్టించేందుకు ఆ నిధులను వినియోగించుకోవచ్చని, కేంద్ర నిధులను మాత్రం వినియోగించరాదని సూచించినట్లు తెలిపారు.
కోతులు, కుక్కల బెడదతో చిన్నారులు, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా నిధులు లేవనే సమాధానం వస్తోందని వాపోయారు. సింగరేణి నుంచి పంచాయతీకి జనరల్ ఫండ్ కింద సుమారు రూ.కోటి వరకు రావాల్సి ఉందని సర్పంచ్ కళ్యాణి, కార్యదర్శి షర్మిల తెలిపారు. సింగరేణి నుంచి నిధులు మంజూరైతే కోతులు, కుక్కల బెడద నివారణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కోతులను పట్టేందుకు సింగరేణి యాజమాన్యం చర్యలు తీసుకోకపోవడం, మరోవైపు పంచాయతీకి జనరల్ ఫండ్ అందకపోవడంతో సమస్య పరిష్కారం కాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి కోతులు, కుక్కల బెడద నుంచి తమకు రక్షణ కల్పించాలని వారు కోరుతున్నారు.