Supreme Court : కేంద్ర ఎన్నికల సంఘం (ECI) స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పేరుతో బీహార్ ఓటర్ల జాబితా (Bihar voters list) ను సవరిస్తోంది. అయితే ఈ సవరణ పేరుతో భారీగా ఓట్లను తొలగిస్తున్నారని, ఓటు నిలుపుకోవడం కోసం, కొత్తగా ఓటు హక్కు కోసం పౌరులు చూపించాల్సిన డాక్యుమెంట్ల జాబితాలో ఆధార్‌కార్డు, ఓటర్ ఐడీ కార్డులను చేర్చలేదని పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది.
ఓటర్ల జాబితాను స్పెషల్ ఇంటెన్సివ్ రిజవిజన్ పేరుతో సవరించేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి అధికారం ఉన్నదని, ఈసీ చట్ట ప్రకారం పని చేస్తుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అయితే ఈ సవరణ లక్ష్యం భారీగా కొత్త ఓటర్లను జాబితాలో చేర్చడమే ఉండాలిగానీ, భారీగా ఓటర్లను జాబితా నుంచి తొలగించడం ఉండకూడదని వ్యాఖ్యానించింది. భారీగా ఓట్లు తొలగింపునకు గురైతే మాత్రం తాము జోక్యం చేసుకుంటామని స్పష్టంచేసింది.
బీహార్ ఓటర్ల జాబితా సవరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఆగస్టు 12, 13 తేదీల్లో విచారిస్తామని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ బాగ్చిలతో కూడిన ధర్మాసనం తెలిపింది. ఆగస్టు 1న ఎన్నికల కమిషన్ సవరించిన ఓటర్ల జాబితాను ప్రచురించనుందని, పాత జాబితాలో ఉన్న అనేక మంది ఓటర్లను ఈ జాబితా నుంచి తొలగించారని, దాంతో వారంతా తమ ఓటు హక్కును కోల్పోనున్నారని పిటిషనర్లు సుప్రీంకోర్టుకు తెలియజేశారు.
దానిపై కోర్టు స్పందిస్తూ.. సవరించిన ఓటరు జాబితాలో ఏవైనా తప్పులను గుర్తిస్తే ఆధారాలతో సహా తమ దృష్టికి తీసుకురావాలని పిటిషనర్లకు సూచించింది. మీరు భయపడుతున్నట్లుగా పెద్ద సంఖ్యలో ఓట్ల తొలగింపు జరిగితే వెంటనే తాము జోక్యం చేసుకుంటామని హామీ ఇచ్చింది. జాబితాలో అవకతవకలు ఉంటే ఆగస్టు 8లోగా పిటిషనర్లు తమకు లిఖితపూర్వకంగా తెలియజేయాలని ధర్మాసనం సూచించింది. అదేవిధంగా వెరిఫికేషన్ డాక్యుమెంట్ల లిస్టులో ఆధార్‌కార్డుకు, ఓటర్ ఐడీకి చోటు కల్పించాలని ఈసీని ఆదేశించింది.