Rajnath Singh : అమెరికా (USA) తనపట్ల వ్యవహరిస్తున్న తీరుపై భారత్ మరోసారి మండిపడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పై భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) పరోక్షంగా విమర్శలు గుప్పించారు. భారత వస్తువులపై అదనంగా 25 శాతం సుంకాలు విధించిన నేపథ్యంలో రాజ్‌నాథ్ తాజా వ్యాఖ్యలు చేశారు. కొన్ని దేశాలు భారత ఆర్థిక పురోగతిని అసూయతో చూస్తూ ఆ పురోగతిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.
కొందరు ‘బాస్’లు భారతదేశం వేగంగా అభివృద్ధి చెందడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ‘మనమే అందరికీ బాస్ అయితే, భారత్ ఇంత వేగంగా ఎలా అభివృద్ధి చెందుతోంది అని వాళ్లు అసూయ పడుతున్నారు’ అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. మధ్యప్రదేశ్‌లోని రైసెన్ జిల్లా ఉమరియా గ్రామంలో బీఈఎంఎల్ (BEML) కొత్త యూనిట్‌కు శంకుస్థాపన చేసిన సందర్భంగా రాజ్‌నాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
కొన్ని దేశాలు భారతీయ ఉత్పత్తులను ఇతర దేశాల ఉత్పత్తుల కంటే ఖరీదైనవిగా చేయడానికి ప్రయత్నిస్తున్నాయని రాజ్‌నాథ్ ఆరోపించారు. తద్వారా ధరలు పెరిగితే ప్రపంచం వాటిని కొనడం మానేస్తుందని ఆ దేశాలు భావిస్తున్నాయని అన్నారు. అయితే భారత్ వేగంగా ముందుకు సాగుతోందని, ఇప్పుడు ఏ శక్తీ భారత్‌ను ప్రపంచంలో గొప్ప శక్తిగా ఎదగకుండా ఆపలేదని చెప్పారు.