PM Modi : ప్రధానమంత్రి (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi), కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah), ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shiva Kumar) కలిసి ఆదివారం మెట్రో రైడ్ (Metro ride) చేశారు. రాజకీయంగా ఎప్పుడూ కర్ణాటక సర్కారుపై విమర్శలు చేసే ప్రధాని.. ఇవాళ ఆ రాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎంలతో అప్యాయంగా మాట్లాడుతూ కనిపించారు. బెంగళూరు (Bengalore) లో జరిగిన నూతన మెట్రో లైన్ ప్రారంభోత్సవం ఈ అరుదైన దృశ్యానికి వేదికైంది.
ఆదివారం బెంగళూరులో ఎల్లో మెట్రో లైన్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్వీ రోడ్ మెట్రో స్టేషన్లో ప్రధానికి స్వాగతం పలికిన సీఎం సిద్ధరామయ్య.. పుష్పగుచ్ఛం అందిస్తూ ఆయన చేతిని పట్టుకుని ఆప్యాయంగా పలకరించారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రాజెక్టు వివరాలను ప్రధానికి ఎంతో ఉత్సాహంగా వివరించారు. కార్యక్రమం పూర్తయ్యాక ముగ్గురు నేతలు కలిసి కొత్త మెట్రో రైలులో ప్రయాణించారు.
ఆర్వీ రోడ్ స్టేషన్ నుంచి బొమ్మనహళ్లి వరకు సాగిన 19.15 కిలోమీటర్ల ప్రయాణంలో ప్రధాని మోదీకి ఇరువైపులా సిద్ధరామయ్య, శివకుమార్‌లు కూర్చున్నారు. ప్రయాణమంతా ముగ్గురూ సరదాగా ముచ్చటించుకున్నారు. రాజకీయ వైరాన్ని పక్కనపెట్టి ఆ ముగ్గురు ఇలా కలిసిపోయి ముచ్చటించుకోవడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
కార్యక్రమానికి ముందు ప్రధాని మోదీ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి టికెట్ కొనుగోలు చేశారు. అనంతరం ఎల్లో లైన్ మెట్రో సేవలకు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ మార్గం బెంగళూరు సెంట్రల్ డిస్ట్రిక్ట్‌ను టెక్ హబ్ అయిన ఎలక్ట్రానిక్స్ సిటీతో కలుపుతుంది. ప్రధానితోపాటు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 16 మంది విద్యార్థినిలు, 8 మంది చిన్నారులు, 8 మంది మెట్రో కార్మికులకు ఈ రైలులో ప్రయాణించే అవకాశం దక్కింది. వారితో కూడా ప్రధాని ముచ్చటించారు.