Hilt-P Policy | హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ (హిల్ట్) పాలసీపై ప్రభుత్వం మొండిపట్టు వీడటం లేదా? పారిశ్రామికవేత్తల అభ్యంతరాలు, ప్రతిపక్షాల విమర్శలు, ఆర్థిక నిపుణుల అభ్యంతరాలను ఏమాత్రం పట్టించుకోవద్దని నిర్ణయించుకున్నదా? నేరుగా అమలు చేస్తే వచ్చే వ్యతిరేకతకు భయపడి అడ్డదారిలో హిల్ట్ పాలసీని అమలు చేయాలని నిర్ణయించిందా? కంపెనీలపై ‘కాలుష్య’ ముద్ర వేసి తరలించాలని ప్లాన్ చేసిందా? ఇప్పటికే కార్యాచరణ కూడా మొదలు పెట్టిందా? అనే ప్రశ్నలకు సచివాలయ వర్గాల నుంచి ‘అవును’ అనే సమాధానం వస్తున్నది.
ప్రజల అభిప్రాయాలతో సంబంధం లేకుండా కేవలం ఆదాయమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పరిశ్రమల యాజమాన్యాలను భయపెట్టి నగరం బయటికి తరలించే ప్రయత్నాలు వేగంగా జరుగుతున్నాయని పారిశ్రామికవర్గాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. తొలిదశలో 1500 పరిశ్రమలను తరలించి, భూ బదలాయింపు ద్వారా రూ.10,776 కోట్ల ఆర్జనకు పథకం వేసినట్టు చర్చ జరుగుతున్నది. అత్యంత గోప్యంగా సాగుతున్న ఈ తంతుపై మాట్లాడేందుకు టీజీఐఐసీ, పీసీబీ అధికారులు నిరాకరిస్తున్నారు.
హిల్ట్ పాలసీలో భాగంగా ఓఆర్ఆర్ లోపల ఉన్న 22 పారిశ్రామికవాడల్లో 3,100 కంపెనీలను తరలించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు సమాచారం. వీటిని నేరుగా తరలిస్తే విమర్శలు ఎదురయ్యే అవకాశం ఉండటంతో ‘కాలుష్యకారక పరిశ్రమలు’గా ముద్రవేసి, తరలించాలని ప్రణాళిక రచించినట్టు చెప్తున్నారు. ఇప్పటికే గుర్తింపు ప్రక్రియ పూర్తయినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. తొలిదశలో 1500 పరిశ్రమలను నగరం దాటించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ముందుగా భారీ స్థాయిలో భూములు ఉన్న బల్క్ డ్రగ్ పరిశ్రమలపై కన్నేసినట్టు సమాచారం. దాదాపు 60 శాతం కంపెనీలకు ఇప్పటికే టీజీఐఐసీ జోనల్ కమిషనర్ల ద్వారా నోటీసులు జారీచేసినట్టు చెప్తున్నారు. నిర్ణీత గడువులోగా పరిశ్రమను ఓఆర్ఆర్ బయటికి దాటించాలని ఆదేశించినట్టు తెలిసింది. లేదంటే పరిశ్రమలో కార్యకలాపాలు నిలుపు చేయాలని, ఆ తర్వాత రెండు నెలల్లోపు ఖాళీ చేయాలని నోటీసుల్లో పేర్కొంటున్నట్టు కంపెనీల యాజమాన్యాలు చెప్తున్నాయి. అయితే నోటీసుల్లో హిల్ట్ పాలసీ పేరు ప్రస్తావించకుండా ప్రభుత్వం జాగ్రత్త పడుతున్నదని పేర్కొంటున్నాయి.
22 పారిశ్రామికవాడల్లో ఉన్న ఫార్మా, కెమికల్, మెటల్, పేపర్, రబ్బర్, పెయింట్స్, టెక్స్టైల్స్ తదితర పరిశ్రమల మీద ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించిందని సమాచారం. ఇప్పటికే కాలుష్య నియంత్రణ సూచీలపై పరిశోధన చేయించినట్టు తెలిసింది. ప్రభుత్వానికి అనుబంధంగా పనిచేస్తున్న ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఈపీటీఆర్ఐ)తో అధ్యయనం చేయించినట్టు తెలిసింది. హిల్ట్ విధానం పరిధిలోకి వచ్చే పారిశ్రామికవాడల్లోని రెడ్ క్యాటగిరీ పరిశ్రమల కాలుష్యం మీద గత నెల రోజులుగా ఈపీటీఆర్ఐ అధ్యయనం చేసినట్టు సమాచారం. మొత్తం 1746 పరిశ్రమలు కాలుష్యాన్ని వెదజల్లుతున్నట్టు గుర్తించి, ప్రభుత్వానికి నివేదించినట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఈ పరిశ్రమలకు అధికారులు నోటీసులు ఇస్తున్నట్టు తెలిసింది. రెడ్ క్యాటగిరీ పరిశ్రమలకు ఎక్కువ భూమి ఉంటుందని, వీటిని తరలించడం ద్వారా పెద్ద మొత్తంలో భూ బదలాయింపు జరుపొచ్చని ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఈ భూముల మార్పిడితో ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.11వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసినట్టు తెలిసింది.
ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్ఆర్)కు వెలుపల పరిశ్రమలను నెలకొల్పటానికి వీలుగా నగరం చుట్టూ 64 ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ భూములను ప్రభుత్వం గుర్తించినట్టు తెలుస్తున్నది. మొదటిదశలో తరలించాలనుకున్న కంపెనీల్లో ఫార్మా కంపెనీలే ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. ఓఆర్ఆర్ లోపల ఉన్న దాదాపు 800 ఫార్మా కంపెనీలు తొలిదశలో తరలించే జాబితాలో ఉన్నాయని చెప్తున్నారు. వీటిని రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలోని ప్రతిపాదిత ఫార్మాసిటీకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది. కాటేదాన్, జీడిమెట్లలోని 35 స్టీల్ కంపెనీలను వికారాబాద్ జిల్లా రాకంచర్ల ఇండస్ట్రియల్ పారుకు, వంటనూనె పరిశ్రమలను జహీరాబాద్ సమీపంలో బుచినేపల్లి ఇండస్ట్రియల్ పారుకు తరలించాలని నిర్ణయించినట్టు సమాచారం.