నగరానికి చెందిన ఓ 65 ఏళ్ల వ్యక్తి ఎల్జీబీటీ డేటింగ్ యాప్‌లో ఓ యువకుడితో చాటింగ్ చేశాడు. రెండ్రోజుల తర్వాత ఆ యువకుడు అమీర్‌పేటలోని ఓ హోటల్ గదికి పిలిచాడు. గదిలో ఇద్దరూ నగ్నంగా ఉన్న సమయంలో బయటి వ్యక్తులు ఇద్దరు లోపలికి వచ్చి సెల్ఫోన్లో వీడియో చిత్రీకరించారు. దాన్ని బయటపెడతానంటూ బెదిరించి ఇద్దరి దగ్గరి నుంచి డబ్బులు వసూలు చేశారు. అయితే హోటల్‌కు బాధితుడిని పిలిచిన యువకుడు కూడా ఆ ముఠాలోసభ్యుడేనని తర్వాత తెలిసింది.మళ్లీ కొన్నిరోజులకు ముఠాసభ్యులు ఆ వృద్ధుడికి ఫోన్ చేసి మరికొన్ని డబ్బులు కావాలని లేకుంటే ఆ వీడియోలు కుటుంబసభ్యులకు పంపుతామని బెదిరించారు. దీంతో బాధితుడు పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
నగరానికి చెందిన ఓ వైద్యుడు యాప్‌లో పరిచయమైన వ్యక్తితో చాటింగ్ చేశారు. ఆ తర్వాత కొద్దిరోజులకు అతను రమ్మనగానే ఫామ్‌హౌజ్‌కు వెళ్లాడు. అక్కడ ఇద్దరు మద్యం తాగారు. అయితే మద్యంమత్తులో ఉండగా ఆ వైద్యుడి నగ్న ఫోటోలు చిత్రీకరించారు. ఈ విషయం తెలియక వైద్యుడు అక్కడి నుంచి బయటకు వచ్చారు. తీరా కొద్దిరోజులకు అతని వాట్సప్‌కు గుర్తు తెలియని వ్యక్తులు డాక్టర్ నగ్న ఫోటోలు పంపి బ్లాక్మెయిల్ చేశారు. దీంతో భయపడ్డ బాధితుడు మోసగాళ్లు అడిగిన రూ.2లక్షలు ఇచ్చినట్లు తెలిసింది.
LGBT Apps | సిటీబ్యూరో, ఆగస్ట్ 9 (నమస్తే తెలంగాణ): నగరంలో ఇటీవల వరుసగా ఈ తరహా కేసులు నమోదవుతున్నాయి. స్వలింగసంపర్కుల ముసుగులో ఈ మోసాలు జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. సాధారణంగా ఎల్జీబీటీ (లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్)యాప్స్‌లో సభ్యత్వం నమోదు చేసుకున్న తర్వాత వారిపై కొందరు మోసగాళ్లు నిఘా పెడుతున్నారు. అందులో కొంత పలుకుబడి, డబ్బులు కలిగిన వారిని టార్గెట్‌గా చేసుకుని వారిని మెల్లగా ముగ్గులోకి దించుతున్నారు.
ఆ తరవాత హోటల్ రూమ్స్, ఫామ్‌హౌస్‌లు, ప్రైవేటు రూమ్స్‌కు పిలిచి వారితో ఎంజాయ్ చేస్తున్నట్లు నటించి తమ ముఠా సభ్యులతో నగ్న వీడియోలు తీయిస్తారు. ఆ తర్వాత వారిని బ్లాక్మెయిల్ చేస్తూ లక్షలు లక్షలు డబ్బులు గుంజుతున్నారు. మోసగాళ్లు తమను తాము గేలుగానో, బైసెక్సువల్గానో చెప్పుకుంటున్నారని పోలీసులు తెలిపారు. ప్రధానంగా స్వలింగసంపర్కులు, బైసెక్సువల్ వాళ్లు మోసగాళ్లుగా ఉండే అవకాశం తక్కువ. కానీ కొందరు వ్యక్తులు ఈ ఐడెంటిటీతో ఇతరులను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని పోలీసులు చెప్పారు.
బాధితులు తాము తమ వ్యక్తిగత వివరాలు చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, ఎవరైనా బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడితే వెంటనే పోలీసులకు తెలపాలని వారు పేర్కొన్నారు. ముఖ్యంగా మాయమాటలు చెప్పి తమతో పాటు డేటింగ్‌కు రమ్మని, అక్కడ అసాంఘిక లైంగిక కార్యకలాపాలకు పాల్పడే రీతిలో వ్యవహరిస్తే జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. ఇలా మోసపోయినవారిలో ఉన్నతవిద్యావంతులు, ఉద్యోగులు ఉంటున్నట్లుగా ఓ పోలీస్ అధికారి చెప్పారు. వీరిలో కొందరు మాత్రమే ఫిర్యాదు చేసేందుకు ముందుకు వస్తున్నారని, మిగతావారు రావడానికి భయపడుతున్నారని, ఒకవేళ తాము కనిపెట్టి అడిగినా ఫిర్యాదు ఇవ్వడం లేదని ఆ అధికారి పేర్కొన్నారు.