హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 13 (నమస్తే తెలంగాణ): ‘న్యాయబద్ధంగా అభివృద్ధి చేయాలి తప్ప ప్రజలను ఆగం చేసి కాదు’ అంటూ మూసీ పరీవాహక కాలనీల ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేశారు. మూసీ పునరుజ్జీవం పేరిట తమ ఇండ్లు కూల్చొద్దని వేడుకుంటున్నా కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోవడం లేదని నిరసిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైదర్షా కోట్ పరిధి సాయిరాం నగర్లో వివిధ కాలనీల ప్రజలు శుక్రవారం నిరసన దీక్షలు ప్రారంభించారు. నల్ల మాస్కులు ధరించి మౌన దీక్ష చేపట్టారు. మూసీ సరోవర్ ప్రాజెక్టు పేరిట తమ ఇండ్లు ఖాళీ చేయాలని ఇచ్చిన నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకునేదాకా దీక్ష కొనసాగిస్తామని స్పష్టంచేశారు.
‘కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పేరిట కూల్చివేతలే లక్ష్యంగా పాలన సాగిస్తున్నది. ఇండ్లు కూల్చకుండా.. పట్టా భూములు స్వాధీనం చేసుకోకుండా అభివృద్ధి చేయలేరా?’ అని నిలదీశారు. ‘మా ఇండ్లకు వర్తించే బఫర్‌జోన్ అదే స్థానంలో కట్టే పెద్దోళ్ల భవనాలకు వర్తించదా?’ అని ప్రశ్నించారు. ప్రజల నుంచి స్థలాలను ప్రజాశ్రేయస్సు కోసం తీసుకోవాలి కానీ.. ఎక్కడి నుంచో వచ్చే పర్యాటకులకు విలాసాన్ని అందించేందుకు తీసుకోవడమేంటని నిలదీశారు.
వ్యవస్థలో లోపానికి సామాన్యులను బలి చేయడమేమిటని మండిపడ్డారు. అభివృద్ధి న్యాయ పంథాలో కొనసాగాలి కానీ.. ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తూ, రోడ్డున పడేసేలా ఉండకూడదని హితవుపలికారు. పైసా పైసా కూడబెట్టుకొని అన్ని అనుమతులు తీసుకొని ఇండ్లు కట్టుకుంటే ఇప్పుడు ఖాళీ చేసి వెళ్లండి అంటే ఎక్కడికి వెళ్లాలని ఆవేదన వ్యక్తంచేశారు.
గాంధీ సరోవర్ బాధితుల దీక్షకు తెలంగాణ బస్తీ జేఏసీ మద్దతు ప్రకటించింది. మూసీ పరీవాహక కాలనీలు, బస్తీలు, అపార్ట్మెంట్లు, విల్లాల ప్రజల తరఫున పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని జేఏసీ చైర్మన్ గోసుల శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. అభివృద్ధి పేరిట బస్తీలు, కాలనీల ప్రజల ఇండ్లు కూలుస్తామం టే కాంగ్రెస్‌పై యుద్ధం చేస్తామని హెచ్చరించారు. మూసీ పునరుజ్జీవానికి జేఏసీ వ్యతిరేకం కాదని, అభివృద్ధి పేరిట ప్రజల ఇండ్లు, భూములు లాక్కుంటామనే నిర్ణయానికి వ్యతిరేకమని స్పష్టంచేశారు. చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకు తిరుగుతున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి.. రేవంత్‌రెడ్డి పేదల ఇండ్లు కూలుస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంటే కనిపించడం లేదా? అని నిలదీశారు. మూసీలోకి మురుగు రాకుండా చేయడం మానేసి.. దానికి ఇరువైపులా ప్రజల నుంచి లాక్కున్న భూముల్లో హోటళ్లు, రెస్టారెంట్లు, మాల్స్ కడుతామనడమేంటని ప్రశ్నించారు.
ప్రభుత్వం తెలివి ప్రదర్శించి సర్వే నంబర్లతో పే పర్ ప్రకటనలు ఇచ్చి వదిలేసింది. మాకు ఎలాంటి నోటీసులు రాకపోయినా నిశ్శబ్దం అంగీకారం అన్నట్టు ఉంటదని మేం దీక్ష చేపట్టినం. మా సర్వే నంబర్ 87 కూడా అందులో ఉన్నది. శుక్రవారం మూసీ ప్రాజెక్ట్‌పై ప్రజెంటేషన్ ఇస్తారని తెలియడంతో మా ఇండ్లు మూసీకి ఇచ్చేది లేదని చెప్పేందుకు ఈ దీక్షకు వచ్చినం. రూ.86 లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కున్నం. నెలకు రూ.60వేల చొప్పున ఈఎంఐ కడుతున్నం.
– సౌమ్య, విఘ్నేశ్వర కాలనీ
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మూసీ డీపీఆర్ విడుదల చేస్తాననడంతో మేము మౌన దీక్షకు దిగినం. ప్రాజెక్టుపై సర్కార్ రోజుకో మాట చెప్తూ మమ్మల్ని మభ్యపెట్టాలని చూస్తున్నది. మూసీ అభివృద్ధి పేరిట మా ఇండ్లు కూలుస్తామంటే ఊరుకునేది లేదు. 2012లో ఇంటి స్థలం కొన్నం. తర్వాత ఇల్లు కట్టుకున్నం. ఇంత వరకు ఎప్పుడూ రాని వరదలు ఇప్పుడు ఎట్లా వచ్చినయ్? రేవంత్‌రెడ్డి కావాలనే మూసీలోకి వరదను వదిలి భయపెట్టాలని చూసిండు. దేనికీ భయపడం.
– వాసుదేవరావు, సాయిరాంనగర్ వాసి
మేము భువనేశ్వర్‌కు చెందిన వా ళ్లం. 14 సంవత్సరాలుగా హైదరాబాద్‌లో ఉంటున్నం. విఘ్నేశ్వర కాలనీలో ఇల్లు కొనుక్కున్నం. ఇప్పుడు మా ఇల్లు కూల్చుతామంటున్నరు. ఉన్నపళంగా ఇల్లు కూల్చితే మేము ఎక్కడికి పోవాలి? మా ఇండ్లను రక్షించుకునేందుకు అందరం కలిసి పోరాడుతం. ఇప్పుడు బఫర్ జోన్లో ఉన్నది అంటున్నరు. మరి అప్పుడు ఎట్ల రిజిస్ట్రేషన్ చేసిండ్రు? దీనిపై అవసరమైతే కోర్టుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నం.
– ధనుష్, విఘ్నేశ్వర కాలనీ