Suicides : భార్యాభర్తల నడుమ గొడవ నాలుగు నిండు ప్రాణాలను బలితీసుకుంది. అభం శుభం తెలియని ముగ్గురు చిన్నారులను పొట్టనపెట్టుకుంది. ఓ మహిళ తన భర్తతో గొడవపడి తన ముగ్గురు పిల్లలను తీసుకుని బయటికి వెళ్లింది. ఆ ముగ్గురిని తన ఒంటికి కట్టుకుని కాలువలో దూకి ఆత్మహత్య (Suicide) కు పాల్పడింది. ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) రాష్ట్రం బండా జిల్లా (Banda district) లోని రిసౌరా (Resoura) గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రిసౌరా గ్రామానికి చెందిన రీనా, అఖిలేశ్ దంపతులకు ముగ్గురు సంతానం. శుక్రవారం రాత్రి భర్తతో గొడవ జరగడంతో పిల్లలను తీసుకొని ఇల్లు వదిలి వెళ్లిపోయింది. ఉదయం లేచి చూసేసరికి కోడలు, పిల్లలు కనిపించకపోవడంతో అత్తమామలు వారి కోసం వెతికారు. చివరికి సమీపంలోని కెన్ కాలువ వద్ద వారికి సంబంధించిన దుస్తులు, గాజులు, చెప్పులు కనిపించాయి.
దాంతో కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. కాలువలోకి దూకి ఉండవచ్చుననే అనుమానంతో పోలీసులు ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. దాదాపు ఆరుగంటలపాటు గాలించిన తర్వాత వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతుల్లో మహిళ రీనా (30), ముగ్గురు చిన్నారులు హిమాన్షు(9), అన్షి (5), ప్రిన్స్ (3)గా పోలీసులు గుర్తించారు. పిల్లలు ముగ్గురిని తల్లి తన ఒంటికి కట్టుకుని ఉంది.
కాలువ నుంచి బయటికి తీసిన అనంతరం మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. మృతురాలి భర్త అఖిలేశ్ని కస్టడీలోని తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.