Iran Ship : ఇరాన్‌కు చెందిన యుద్ధ నౌకపై శ్రీలంక తీరంలో అమెరికా సబ్‌మెరైన్ బుధవారం ఉదయం దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటివరకు 80 మందికిపైగా మరణించినట్లు సమాచారం. గల్లంతైన మిగతావారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో 32 మంది వరకు శ్రీలంక నేవీ రక్షించింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఇరాన్‌కు చెందిన యుద్ధనౌక ఐఆర్ఐఎస్ దేనా ఇండియా నుంచి తిరిగి వెళ్తుండగా ఈ దాడి జరిగింది.
కొన్ని వారాల క్రితం ఈ యుద్ధ నౌక ఇరాన్ నుంచి ఇండియా చేరుకుంది. ఇండియాకు చెందిన హిందూ మహా సముద్రంలో జరిగిన ఇండో-పసిఫిక్ నావికా విన్యాసాల్లో ఈ నౌక పాల్గొంది. ఈ నౌక ఇండియా రావడం ఇది రెండోసారి. మొదటిసారి 2024లో నావికా విన్యాసాల్లో పాల్గొని తిరిగి వెళ్లింది. ఇప్పుడు 2026 ఫిబ్రవరిలో నావికా విన్యాసాల కోసం వచ్చింది. అనంతరం తిరిగి వెళ్తుండగా అమెరికా సబ్ మెరైన్ దాడి చేసింది. ఈ నౌకను తామే ముంచేశామని అమెరికా ప్రకటించుకుంది. ఈ ఘటన జరిగిన సమయంలో నౌకలో దాదాపు 180 మంది ఉన్నట్లు తెలుస్తోంది. అందులో 32 మందిని శ్రీలంక నేవీ రక్షించింది. మిగతా 148 మంది గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు 80 మందికిపైగా మృతదేహాల్ని గుర్తించారు. సాధారణంగా నావికా విన్యాసాల కోసం రక్షణ, యుద్ధ నౌకలు విదేశీ సముద్ర జలాల్లోకి వెళ్తుంటాయి.
విదేశీ ఇంటెలిజెన్స్‌కు తెలిసినా కొన్ని నౌకలు ఇలా వెళ్తుంటాయి. అలా ఈ నౌక ఇండియా వస్తున్న సందర్భంలో అమెరికన్ సబ్ మెరైన్ దీన్ని ట్రాక్ చేసి ఉండవచ్చని, తిరిగి వెళ్తుండగా దాడి చేశారని నిపుణులు అంటున్నారు. ఈ దాడిపై అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ మాట్లాడారు. తామే ఇరాన్ నౌకపై సబ్ మెరైన్ టార్పిడోలతో దాడి చేశామన్నారు. ఇరాన్‌పై అసలైన దాడులను ఇప్పుడు ప్రారంభించామని తెలిపారు. తమ దగ్గర మరిన్ని అధునాతన ఆయుధాలున్నాయని, ఇరాన్ గగనతలాన్ని స్వాధీనం చేసుకుంటామని ఆయన వెల్లడించారు.