Chuck Russell | హాలీవుడ్లో హారర్, యాక్షన్, కామెడీ చిత్రాలకు కొత్త ఒరవడి తీసుకొచ్చిన ప్రముఖ దర్శకుడు చక్ రస్సెల్ కన్నుమూశారు. ఆయన ఈ వారం ప్రారంభంలో అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం సాన్ డియాగోలో తన నివాసంలో అపస్మారక స్థితిలో కనిపించగా, అనంతరం మరణించినట్లు కుటుంబ సభ్యులు, న్యాయ ప్రతినిధులు ధృవీకరించారు. ఆయన మరణంతో ప్రపంచ సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. 74 ఏళ్ల వయసులో చక్ కన్నుమూసారు. జూలై 25న వెలువడిన సమాచారం ప్రకారం, అత్యవసర వైద్య సేవల కోసం వచ్చిన అధికారులు ఆయనను ఇంట్లో అపస్మారక స్థితిలో గుర్తించారు. అయితే ఆయన మరణానికి గల ఖచ్చితమైన కారణాన్ని ఇంకా వెల్లడించలేదు. చక్ రస్సెల్‌కు భార్య అనియా, పిల్లలు లోగన్, రైలీ, కార్లిన్, సోదరి ఆన్ ఉన్నారు.
చక్ రస్సెల్ సినీ ప్రస్థానం ప్రొడక్షన్ అసిస్టెంట్, అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రారంభమైంది. 1984లో విడుదలైన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘డ్రీమ్స్కేప్’ చిత్రానికి స్క్రీన్‌రైటర్‌గా పనిచేసి మంచి గుర్తింపు పొందారు. అనంతరం ప్రముఖ రచయిత ఫ్రాంక్ డారబాంట్తో కలిసి పలు విజయవంతమైన ప్రాజెక్టులపై పనిచేశారు. 1987లో వచ్చిన ‘ఎ నైట్మేర్ ఆన్ ఎల్మ్ స్ట్రీట్ 3: డ్రీమ్ వారియర్స్’ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసిన ఆయన, అప్పటికే బలహీనపడుతున్న ఆ హారర్ ఫ్రాంచైజీకి మళ్లీ ఊపిరి పోశారు. ఆ చిత్రం భారీ వాణిజ్య విజయాన్ని అందుకోవడంతో దర్శకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. 1988లో వచ్చిన ‘ది బ్లాబ్’ రీమేక్‌తో హారర్ చిత్రాల్లో తన ప్రత్యేక ముద్ర వేసిన చక్ రస్సెల్, 1994లో విడుదలైన ది మాస్క్ తో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. జిమ్ కేరీ హీరోగా నటించిన ఈ చిత్రం కామెడీ, ఫాంటసీ, విజువల్ ఎఫెక్ట్స్ కలయికతో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
ఈ సినిమాతో నటి కెమెరాన్ డియాజ్ వెండితెరకు పరిచయమవగా, జిమ్ కేరీని హాలీవుడ్లో అగ్ర కామెడీ స్టార్‌గా నిలబెట్టడంలో ఈ చిత్రం కీలక పాత్ర పోషించింది. సుమారు 18 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 350 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించి చరిత్ర సృష్టించింది. ‘ది మాస్క్’ తర్వాత చక్ రస్సెల్ యాక్షన్ చిత్రాలపై దృష్టి పెట్టారు. 1996లో అర్ణోల్డ్ ష్వార్జ్నెగర్తో తెరకెక్కించిన ‘ఇరేజర్’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. అనంతరం 2002లో విడుదలైన ‘ది స్కార్పియన్ కింగ్’ చిత్రంలో డ్వేన్ “ది రాక్” జాన్సన్‌ను హీరోగా పరిచయం చేసి, ఆయన హాలీవుడ్ కెరీర్‌కు బలమైన పునాది వేశారు. హాలీవుడ్‌తో పాటు భారతీయ సినీ పరిశ్రమలోనూ చక్ రస్సెల్ తన ముద్ర వేశారు. విద్యుత్ జమ్మ్వాల్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ అడ్వెంచర్ చిత్రం జంగ్లీ కి దర్శకత్వం వహించి బాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నారు. చివరిగా 2024లో విడుదలైన ‘విచ్బోర్డ్’ రీమేక్‌తో ప్రేక్షకులను పలకరించారు.
సినిమా నిర్మాణంలో కొత్త సాంకేతికతలను వినియోగించాలనే ఆలోచనతో చక్ రస్సెల్ ఇటీవల ‘న్యూమార్ఫిక్’ అనే AI ఆధారిత సంస్థను ప్రారంభించారు. జనరేటివ్ AI సాయంతో సినిమాల నిర్మాణ ప్రక్రియను మరింత ఆధునికంగా మార్చే రెండు ప్రాజెక్టులను కూడా ప్రకటించారు.