Naga Chaitanya | అక్కినేని హీరో నాగ చైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ మరోసారి తమ ముచ్చటైన సంభాషణతో సోషల్ మీడియాలో అభిమానులను ఆకట్టుకున్నారు. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అరుదైన క్షణాలను అభిమానులతో పంచుకునే ఈ జంట, తాజాగా ఓ సరదా పోస్ట్‌తో నెట్టింట వైరల్‌గా మారింది. శోభిత ధూళిపాళ తొలిసారి నాగ చైతన్య కోసం స్వయంగా వంట చేసి రాత్రి భోజనం సిద్ధం చేశారు. ఈ ప్రత్యేకమైన క్షణాన్ని చైతూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ, శోభిత రెండు గిన్నెలతో చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. అయితే ఆ ఫొటో కంటే ఎక్కువగా అందరి దృష్టిని ఆకర్షించింది చైతూ రాసిన క్యాప్షన్.
పెళ్లై దాదాపు రెండేళ్ల తర్వాత నా భార్య తొలిసారి నా కోసం డిన్నర్ చేసింది. ఈ రోజు నేను ఏదో మంచి పని చేసి ఉంటాననుకుంటా అంటూ సరదాగా కామెంట్ చేశారు. చైతూ పోస్ట్‌కు శోభిత కూడా వెంటనే స్పందించారు. నువ్వు నన్ను ట్రోల్ చేస్తున్నావా… లేక పొగుడుతున్నావా? అంటూ సరదాగా కామెంట్ చేయగా, ఈ ఇద్దరి మధ్య జరిగిన ఈ చిన్న సంభాషణ అభిమానులను ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో ఈ పోస్టుకు వేలాది లైక్స్, కామెంట్లు వస్తున్నాయి. ఈ పోస్ట్ వెనుక ఆసక్తికరమైన కథ కూడా ఉంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో “ఇద్దరిలో ఎవరు బాగా వంట చేస్తారు?” అనే ప్రశ్నకు నాగ చైతన్య సరదాగా స్పందించారు.
తాను ప్రతిరోజూ శోభితకు హాట్ చాక్లెట్ తయారు చేసి ఇస్తానని చెప్పిన చైతూకు, అది వంట కిందకు రాదని వ్యాఖ్య వచ్చింది. అదే సమయంలో శోభితకు వంట చేయడం కూడా సరిగా రాదంటూ, అది ప్రతి ఒక్కరికీ ఉండాల్సిన ‘బేసిక్ హ్యూమన్ స్కిల్’ అని చమత్కరించారు. ఆ కామెంట్ అప్పట్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆ తర్వాత శోభిత కూడా షూటింగ్ లొకేషన్లో బెండకాయలు కోస్తూ, పప్పు వండుతున్న ఫొటోలను షేర్ చేస్తూ చైతూకు సరదాగా రిప్లై ఇచ్చారు. దానికి నాగ చైతన్య “నీ చేతి వంట రుచి చూడటానికి ఎదురు చూస్తున్నా” అంటూ కామెంట్ చేశారు. ఇప్పుడు ఎట్టకేలకు ఆ నిరీక్షణకు ముగింపు పలుకుతూ శోభిత స్వయంగా వంట చేసి చైతూకు డిన్నర్ వడ్డించడంతో, అభిమానులు “ప్రామిస్ నిలబెట్టుకుంది” అంటూ కామెంట్లు చేస్తున్నారు.