హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులను కొత్త సమస్యలు వెంటాడుతున్నాయి. నిత్యం డ్యూటీ మొదలుపెట్టే సమయంలో నిర్వహించే బ్రీత్ అనలైజర్ టెస్టుల్లో మద్యపానం అలవాటు లేనివారికి సైతం మద్యం సేవించినట్టు వస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగ విరమణకు చేరువైనవారికే ఈ సమస్య ఎక్కువగా ఎదురవుతున్నది.
తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలోని ఓ డిపో డ్రైవర్ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడు. మద్యం అలవాటు లేకపోవడంతోపాటు గుండెకు బైపాస్ శస్త్రచికిత్స చేయించుకున్న ఆ సీనియర్ డ్రైవర్‌కు తొలుత బ్రీత్ అనలైజర్ టెస్టులో 152 పాయింట్లు (బీఏసీ) చూపించడంతో కంగుతిన్నాడు. మళ్లీ 5 నిమిషాల వ్యవధిలో అదే బ్రీత్ అనలైజర్ టెస్టులో 54 పాయింట్లు చూపించింది. డిపో మేనేజర్ సూచన మేరకు డ్రైవర్ మద్యం తాగినట్టుగానే రికార్డుల్లో నమోదు చేసేందుకు ప్రయత్నించారు.
ఇప్పటివరకూ ఆ డ్రైవర్ తన సర్వీసులో ఎన్నడూ మద్యం సేవించిన దాఖలాలు లేవు. తనకు మద్యం తాగే అలవాటు లేదని ఆయన చెప్తున్నప్పటికీ ఆర్టీసీ అధికారులు పట్టించుకోలేదు. ప్రస్తుతం రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్నానని, ఈ సమయంలో మద్యం సేవించినట్టు తనపై మచ్చ పడితే రావాల్సిన బెనిఫిట్స్ ఆగిపోతాయని అధికారులకు మొరపెట్టుకున్నా వినలేదు. దీంతో ఆ డ్రైవర్ సమీపంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాల్సి వచ్చింది. అక్కడి పోలీసులను ఒప్పించి బ్రీత్ అనలైజర్ టెస్టు చేయించుకోవడంతో ‘జీరో’ చూపించింది. దాన్ని ఫొటో తీసుకున్న ఆ డ్రైవర్.. తన డిపోలోని అధికారులకు చూపినా కనికరించలేదు.
తమ బ్రీతింగ్ అనలైజరే గొప్పదన్నట్టుగా ఆ అధికారులు మాట్లాటడంతో ప్రభుత్వ దవాఖానలో తనకు ఆర్టీసీ అధికారుల సమక్షంలో బ్లడ్ టెస్టులు చేయించాలని ఆ డ్రైవర్ కోరాడు. అందుకు కూడా అధికారులు అంగీకరించకపోవడంతో యూనియన్ల నాయకులను సంప్రదించాడు. వారు ఆర్టీసీ అధికారులతో మాట్లాడినా, విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో డిపోలో మూకుమ్మడి బంద్‌కు పిలుపు ఇస్తామని హెచ్చరించారు. దీంతో దిగొచ్చిన ఆర్టీసీ అధికారులు.. ఈడీ స్థాయిలో నిర్ణయం తీసుకొని ఆ డ్రైవర్‌పై డ్రంక్ అండ్ డ్రైవ్ రిమార్క్ రాయకుండా వదిలేసినట్టు తెలిసింది.
తాము రాత్రిపూట పెరుగు తిన్నా, లేక మధ్యాహ్నమో, సాయంత్రమో వండిన అన్నం, చారులు, పులిసిన కూరలు తిన్నా బ్రీత్ అనలైజర్ టెస్టుల్లో వ్యతిరేక ఫలితాలే వస్తున్నాయని ఆర్టీసీ డ్రైవర్లు చెప్తున్నారు. మద్యం అలవాటు లేనివారికి సైతం ‘పాజిటివ్’గా చూపించడం అన్యాయమని వాపోతున్నారు. ఆ టెస్టులను సవాలు చేసుకునే అవకాశం కల్పించాలని, ఆర్టీసీ అధికారులు, వైద్యుల సమక్షంలో రక్తపరీక్షలు చేయించుకునే వెసులుబాటు ఇవ్వాలని కోరుతున్నారు.
అలా కాకుండా మద్యం సేవించినట్టు నిర్దాక్షిణ్యంగా రిమార్కు రాస్తే తమకు రావాల్సిన బెనిఫిట్స్ అందవని ఆందోళన చెందుతున్నారు. నిజానికి రాత్రి సమయంలో బాగా పులిసిన పెరుగు లేదా ఆహారం తింటే కడుపులో ఏర్పడే గ్యాస్ వల్ల బీఏసీ రీడింగ్ ‘పాజిటివ్’ వచ్చే అవకాశం ఉన్నదని, ఆయుర్వేద ఔషధాలు, ఇతర గ్యాస్ట్రిక్ మందులు వాడుతున్న వారి నోటి నుంచి వచ్చే ఆవిర్ల వల్ల కూడా బ్రీత్ అనలైజర్ తప్పుగా స్పందిస్తుందని నిపుణులు చెప్తున్నారు. కొన్ని సందర్భాల్లో డివైజ్ ఫాల్ట్ వల్ల కూడా రీడింగ్స్‌లో భారీ వ్యత్యాసాలు వస్తాయని అంటున్నారు.