Rahul Gandhi : ఎన్నికల సంఘాన్ని లక్ష్యంగా కాంగ్రెస్ అగ్రనేత (Congress leader) రాహుల్ గాంధీ (Rahul Gandhi) తన ఆరోపణలను తీవ్రం చేశారు. ఓట్ల విషయంలో బీజేపీ (BJP) తో కలిసి ఈసీ అవకతవకలకు పాల్పడుతున్నట్లు యావత్ దేశానికి తెలిసిందన్నారు. బీహార్ (Bihar) లోని ససారం నగరంలో ‘ఓటర్ అధికార్ యాత్ర’ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఓటర్ల జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ పేరిట బీహార్‌లో ఓట్ల తొలగింపు, చేర్పుల లాంటి కుట్రలకు తెరలేపారని ఆరోపించారు.
‘ఇండియా’ కూటమి దీనికి అనుమతించబోదని, పేదల ఓటు అధికారాన్ని వారి నుంచి దూరం కానివ్వబోదని అన్నారు. దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు చోరీకి గురవుతున్నాయని ఆరోపించారు. మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి సత్తా చాటిందని, అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమదే విజయమనే అంచనాలు వెలువడ్డాయని, కానీ నాలుగు నెలల్లోనే కోటి మంది ఓటర్లు వచ్చి చేరడంతో బీజేపీ కూటమి గెలిచిందని వెల్లడించారు.
ఎక్కడైతే ఓట్లు పెరిగాయో అక్కడ కాషాయ పార్టీ గెలిచిందని రాహుల్‌గాంధీ చెప్పారు. ఈసీ ఏం చేస్తోందో ఇప్పుడు అందరికీ తెలిసిందని అన్నారు. ఓట్ల చోరీ ఆరోపణలపై ఎన్నికల సంఘం తన నుంచి అఫిడవిట్ కోరిందని, బీజేపీ నేతలూ అదేవిధమైన వాదనలు చేస్తే ఆ ప్రస్తావనే తీసుకురాలేదని తెలిపారు. బీజేపీ, ఆరెస్సెస్‌లు రాజ్యాంగాన్ని దెబ్బతీసేందుకు యత్నిస్తున్నాయని రాహుల్‌గాంధీ ఆరోపించారు.