Mid Manair | రాజన్న సిరిసిల్ల, మార్చి 17(నమస్తే తెలంగాణ) : సిరిసిల్ల జిల్లాలోని శ్రీరాజరాజేశ్వర జలాశయ(మధ్యమానేరు) నిర్వాసితులకు కాంగ్రెస్ సర్కార్ మొదటినుంచీ మోసం చేస్తూనే ఉన్నది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓట్లు దండుకునేందుకు ఆర్భాటంగా హామీలు గుప్పించిన రేవంత్‌రెడ్డి.. వాటిని నెరవేర్చకపోవడంతో వారికి నిరాశే మిగిల్చింది. తాము అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోపే ప్రత్యేక జీవో తెచ్చి మరీ ప్రతి నిర్వాసిత కుటుంబానికీ రూ.5.04 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చి రెండేండ్లు గడిచినా ఇప్పటికీ అతీగతీ లేదు. కనీసం ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనైనా ప్రత్యేక జీవో విడుదల చేసి తమకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని నిర్వాసితులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుత ధరలకనుగుణంగా పరిహారం పెంచి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
మధ్యమానేరు ప్రాజెక్టులో మొత్తం 10,683 మంది నిర్వాసిత కుటుంబాలు ఉన్నాయి. అందులో 5,987మంది అప్పులు చేసి, పరిహారం డబ్బులతో ఇండ్లు నిర్మించుకున్నారు. కొందరు బ్యాంకు కిస్తీలు కట్టలేక ఇబ్బందులు పడగా, ఇంకా 4,696 మందికి స్థోమత లేక సొంతిండ్లు నిర్మించుకోలేదు. వీరికి కూడా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలనే అభ్యర్థన మేరకు రాష్ట్ర రిజర్వ్ కోటా ద్వారా రూ.5లక్షల చొప్పున మంజూరు చేస్తున్నట్టు ప్రభుత్వం 2024 నవంబర్ 16న జీవో నెంబర్ 42ను విడుదల చేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వేములవాడ పర్యటన నేపథ్యంలో నిర్వాసితులు అడ్డుకుంటారనే భయంతో ఆగమేఘాల మీద ఇచ్చిన జీవోపై నిర్వాసితుల్లో ఆందోళన మొదలైంది. ఈ జీవో పలు అనుమానాలకు తావిచ్చింది. ఇల్లు కట్టుకున్నవారికి, కట్టుకోని వారికి రూ.5.04లక్షలు అందివ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి ధరలకు అనుగుణంగా రూ.5.04లక్షలు సరిపోవని, ఇంకా పెంచి ఇవ్వాలని విన్నవిస్తున్నారు.
సమైక్య పాలకుల నిర్లక్ష్యంతో మధ్యలోనే వదిలేసిన మధ్యమానేరు ప్రాజెక్టును 2014లో అధికారంలోని రాగానే కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. యుద్ధప్రాతిపదికన రూ.2,669.52 కోట్లు వెచ్చించి ప్రాజెక్టును పూర్తి చేయించారు. 27.55 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 2,32,814 ఎకరాల సాగుకు నీరందిస్తూ కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయలా మారింది. మెట్ట రైతులకు సాగునీటి కష్టాలను తీర్చింది. కానీ, రెండున్నరేండ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మాత్రం నిర్వాసితుల కష్టాలను పట్టించుకోవడం లేదు.
రేవంత్‌రెడ్డితో పాటు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, ఆది శ్రీనివాస్ మేడిపల్లి సత్యం, స్థానిక కాంగ్రెస్ నాయకులు ఎన్నికలప్పుడు మభ్యపెట్టి మా ఓట్లు వేయించుకున్నారు. రెండున్నరేండ్లయినా పట్టించుకుంటలేరు. జిల్లా పర్యటనకు రేవంత్‌రెడ్డి మొదటిసారి వచ్చినప్పుడు ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ఒక జీవో ఇచ్చారు. ప్రతి ఇంటికీ 5లక్షల 4వేల రూపాయలు ఇస్తామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చెప్పారు. మేమంతా ఈ జీవోను వ్యతిరేకించాం. మాకు ఇందిరమ్మ ఇల్లు కాదు, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కావాలని చెప్పాం. అవేవీ పట్టించుకోకుండా మోసం చేశారు. ఇప్పటికీ ఒక రూపాయి కూడా నిర్వాసితుల కోసం ఇవ్వలేదు. ఇప్పటికైనా వెంటనే విడుదల చేయాలి. లేకుంటే మిడ్‌మానేరు ఐక్య సమితి ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తాం.