హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ అధిష్ఠానం, ముఖ్యనేత నాయకత్వం మధ్య ఆధిపత్య పెనుగులాట జరుగుతున్నదా? వలస వ్యూ హాన్ని కట్టడి చేసి, ముఖ్యనేత చుట్టూ కేంద్రీకృతమైన శక్తి కేంద్రాలను నిర్వీర్యం చేసేందుకు ఏఐసీసీ ‘ఆపరేషన్ తెలంగాణ కాంగ్రెస్’ మొదలుపెట్టిందా? అధిష్ఠానం ఆపరేషన్‌ను తిప్పికొట్టేందుకు ముఖ్యనేత ఒక్కొక్క అస్ర్తాన్ని ప్రయోగిస్తున్నారా? దళిత ఎమ్మెల్యేలు ఒకరి తరువాత ఒకరు గళమెత్తడం ముఖ్యనేత వ్యూహమేనా? దళిత సెంటిమెంట్‌ను రాజకీయ కవచంగా మలుచుకొనే ఎత్తా? గత నెల రోజులుగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలను పరిశీలిస్తే..‘అవును’ అనే సమాధానమే వినిపిస్తున్నది. మొన్న తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్… ఇవాళ మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. పేర్లు వేరు. నియోజకవర్గాలు వేరు. కానీ, ఇద్దరి గొంతులోనూ ఒకే బాధ వినిపిస్తున్నది. ఇద్దరూ దళిత ఎమ్మెల్యేలే. ఇద్దరూ అధికార పక్షానికే చెందినవారే. అయినా ప్రభుత్వం, పార్టీలో తమను అణచివేస్తున్నారని బహిరంగంగా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. వీరి మాటలను బట్టి చూస్తే, వాళ్ల ఆవేదన ఇంతటితో ఆగేట్టు లేదు. రేపో-మాపో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా గొంతు విప్పనున్నట్టు తెలుస్తున్నది. అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు మీడియా ముందుకొచ్చి తమ గౌరవం కోసం పోరాడాల్సి వస్తే.. అది వ్యక్తిగత అసంతృప్తి ఒకటే కాదు.
అధికార వ్యవస్థలో ప్రమాద ఘంటికలు మొదలయ్యాయనే రాజకీయ హెచ్చరిక అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే, దళిత ఎమ్మెల్యేల అసంతృప్తి విడివిడిగా వినిపించడం లేదు. ఒకే స్వరంగా వినిపిస్తున్నది. ఒకే బాణీలో బయటపడుతున్నది. ఇది అసంకల్పితమా? లేక వ్యూహాత్మకమా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది. ఇకడే మరో పరిణామాన్ని కలిపి చూడాల్సిన అవసరం ఉన్నదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో వలస నేతలు క్రమంగా ప్రత్యామ్నాయ అధికార కేంద్రంగా ఎదుగుతున్నారని, సొంత ఎజెండా అమలు చేస్తున్నారనే సంకేతాలు ఢిల్లీ కాంగ్రెస్‌ను కలవరపెడుతున్నాయి. ముఖ్యనేత చుట్టూ ఏర్పడిన వర్గం రాష్ట్ర పార్టీని తన గుప్పిట్లోకి తెచ్చుకొనే ప్రయత్నం చేస్తున్నదనే నివేదికలు ఢిల్లీకి అందినట్టు సమాచారం. ఎటువంటి రాజకీయ పరిస్థితులు వచ్చినా నిలదొక్కుకునేందుకు తనకంటూ ఒక ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారనే ఆరోపణలు ఎప్పటినుంచో వస్తున్నాయి. ప్రధాని మోదీ హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంలో ‘మేరే సే జోడీ’ అనే ఆహ్వానం పలికిన తరువాత ఈ అనుమాలు మరింత బలపడ్డాయి.
పార్టీ కాదు.. వ్యక్తిగత ఎజెండా?
ఇటీవల మీనాక్షీనటరాజన్ సేకరించిన ఫీడ్‌బ్యాక్‌లో మరింత సమాచారం బయటికి వచ్చినట్టు తెలిసింది. ప్రభుత్వ నిర్ణయాల్లో కాంగ్రెస్ పార్టీ తీర్మానాలు, ఎన్నికల హామీలు, ఎమ్మెల్యేల అభిప్రాయాల కంటే వ్యక్తిగత రాజకీయ ప్రాధాన్యాలే ముందుకు వెళ్తున్నాయని పలువురు ఎమ్మెల్యేలు అభిప్రాయపడినట్టు సమాచారం. ప్రభుత్వం ఒక దిశలో, పార్టీ మరో దిశలో నడుస్తున్నదనే వ్యాఖ్యలు కూడా నమోదైనట్టు తెలిసింది. పార్టీలో అంతర్గత విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయని, వలస వ్యూహంతో తన వర్గం నేతలను బలోపేతం చేసుకుంటున్నారని పలువురు ఎమ్మెల్యేలు పేర్కొన్నట్టు సమాచారం. సీనియర్ కాంగ్రెస్ నాయకులకు తగిన ప్రాధాన్యం లేకపోవడం, ఇటీవల పార్టీలో చేరిన నాయకులకే అధిక అవకాశాలు కల్పిస్తున్నారనే అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ‘అసలు కాంగ్రెస్ – వలస కాంగ్రెస్’ అనే రెండు శిబిరాలుగా పార్టీ విడిపోయిందని ఎమ్మెల్యేలతోపాటు, డీసీసీ నేతలు తమ అభిప్రాయాల్లో నమోదు చేసినట్టు తెలిసింది. దీంతో అప్రమత్తమైన ఏఐసీసీ ‘ఆపరేషన్ తెలంగాణ కాంగ్రెస్’ను మొదలు పెట్టిందనే ప్రచారం జరుగుతున్నది.
సీఎం పట్టును సడలించే వ్యూహం
ఈ ప్రక్రియ వెనుక ఉద్దేశం స్పష్టంగానే అర్థమవుతున్నది. ఇప్పుడే నేరుగా ముఖ్యనేతను కదిలించకుండా, పార్టీ మీద ఆయన పట్టు సడలేలా చుట్టూ ఉన్న అధికారాన్ని కొంత వికేంద్రీకరించి, అధిష్ఠానం తన పట్టు బిగించడమే లక్ష్యంగా ఆపరేషన్ మొదలుపెట్టినట్టు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఆపరేషన్ బాధ్యతలు ఏఐసీసీ ఢిల్లీ దూత మీనాక్షీనటరాజన్కు అప్పగించారని చెప్తున్నారు. ఇలాంటి సంకేతాలు అందినప్పుడు ఏ నాయకుడైనా రాజకీయంగా అప్రమత్తం కావడం సహజమేనని, ముఖ్యనేత కూడా అందుకు భిన్నంగా వ్యవహరించే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. దళిత ఎమ్మెల్యేల వరుస అసంతృప్తి ఇప్పుడు కేవలం వ్యక్తిగత ఆవేదనగా కాకుండా అధిష్ఠానం, ముఖ్యనేత మధ్య నడుస్తున్న ఒక నిశ్శబ్ద అధికార యుద్ధంలో సదరు ముఖ్యనేత ఆడుతున్న ఒక ఎత్తు అనే చర్చ జరుగుతున్నది. దళిత ప్రజాప్రతినిధులను తన రాజకీయ కవచంగా వాడుకుంటున్నారన్నదే ఇప్పుడు గాంధీభవన్ కారిడార్లలో వినిపిస్తున్న టాక్.
దళిత ఎమ్మెల్యేలను ఎగదోస్తున్నరా?
తమ ఫిర్యాదులు, అభ్యంతరాలతో దళిత ఎమ్మెల్యేలంతా డిప్యూటీ సీఎం భట్టి విక్రమారను ఆశ్రయిస్తుండటం కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తున్నది. ఇప్పటికే సీఎం- డిప్యూటీ సీఎం మధ్య అధికార సమతూకంపై అధిష్ఠానం స్థాయిలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో దళిత ఎమ్మెల్యేలు పనిగట్టుకొని ఆయన వద్దకు వెళ్లడం ఆసక్తికరంగా మారింది. డిప్యూటీ సీఎం వద్దకు వెళ్లిన వారిలో ముఖ్యనేత సన్నిహితులుగా భావించే నాగర్‌కర్నూల్ ఎంపీ, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఉండటాన్ని యాదృచ్ఛికంగా కొట్టిపారేయలేమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అధిష్ఠానం గురి తనపైనే ఉన్నదని గ్రహించిన ముఖ్యనేత దాన్ని పకదారి పట్టించేందుకే దళిత ఎమ్మెల్యేలను ఎగదోసే వ్యూహాన్ని అమల్లోకి తెచ్చారనే ప్రచారం జరుగుతున్నది. దళిత ఎమ్మెల్యేలంతా ముందుగా సీఎంను కలిశారు. కానీ, దానికి పెద్దగా ప్రాచుర్యం, ప్రాముఖ్యత ఇవ్వలేదు. రెండవ రోజు డిప్యూటీ సీఎం భట్టి విక్రమారను కలిశారు. సీఎంకు చెప్పిన అంశాలనే ఆయనకూ చెప్పారు. కానీ, భట్టిని కలిసిన విషయాన్ని వ్యూహాత్మకంగా మీడియాకు అధికారికంగానే వెల్లడించారు.
ఇది ఆషామాషీగా జరిగింది కాదని, ముఖ్యనేత సూచన మేరకే ఈ భేటీలు జరిగాయని రాజకీయ వర్గాల విశ్లేషిస్తున్నాయి. ఎందుకంటే, సమన్వయంతో సాగుతున్న దళిత ఎమ్మెల్యేల తిరుగుబాటు అదీ సరిగ్గా.. అధిష్ఠానం ‘ఆపరేషన్ కాంగ్రెస్” మొదలుపెట్టిన సమయంలోనే బయటకు రావడం కేవలం కాకతాళీయం కాదనే చర్చ జరుగుతున్నది. ఈ ఎత్తుగడ వెనుక లాజిక్ చాలా సింపుల్‌గా ఉన్నదని, ప్రస్తుతం అధిష్ఠానం దృష్టి ‘ముఖ్యనేత వర్సెస్ పార్టీ’ అనే ఫ్రేమ్‌లో ఉన్నదని, దాన్ని ‘పార్టీ వర్సెస్ దళిత ఎమ్మెల్యేలు’ అనే కొత్త ఫ్రేమ్‌లోకి పొందుపరిచే ప్రయత్నమనే చర్చ జరుగుతున్నది. దళిత అసంతృప్తి అనే అంశం ఎంత పెద్దగా వార్తల్లోకి వస్తే, ‘వలస నేతల ఆధిపత్యం’ అనే అంశం అంత బలంగా వెనకిపోతుందని అంచనా వేస్తున్నారు. దీనితోపాటు రాజకీయంగా తనకు కొరకరాని కొయ్యగా మారిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని అతి సులువుగా తీసి పారెయ్యవచ్చనే ఆలోచన కూడా ఉన్నట్టు తెలిసింది. ఈ పథకంలో భాగంగానే నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా కోమటిరెడ్డి మీద గొంతు విప్పే అవకాశం ఉన్నదని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇప్పటికే భట్టికి అపకీర్తి
ఇందులో రెండో వ్యూహం కూడా ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార దగ్గరికే దళిత ఎమ్మెల్యేలను పంపడం ద్వారా, భట్టిని కూడా ఇరుకున పెట్టే ఎత్తుగడ ఉన్నదని చెప్తున్నారు. దళిత ఎమ్మెల్యేల డిమాండ్లను భట్టి పరిషరించలేకపోతే, దళిత డిప్యూటీ సీఎం అయినా దళిత ఎమ్మెల్యేలకు న్యాయం చేయలేకపోయాడనే అపకీర్తి ప్రచారంలోకి వస్తుందని, స్వయంగా దీనిని దళిత వర్గం ఎమ్మెల్యేలే ప్రచారంలోకి తెస్తారని చెప్తున్నారు. ఇప్పటికీ కాంట్రాక్టర్ల బిల్లుల్లో 20% కమీషన్ల ప్రచారంతో అంపశయ్య మీద ఉన్న భట్టి విక్రమార్క ఇమేజ్ను ఈ ప్రచారం మరింత దెబ్బతీస్తుందని భావిస్తున్నారు. ఒకవేళ భట్టి చొరవ తీసుకొని పరిషరిస్తే మాత్రం, ఆ క్రెడిట్ పార్టీ ఖాతాలోకే వెళ్తుంది తప్ప, భట్టి వ్యక్తిగత రాజకీయ ఖాతాలోకి రాదని, రానివ్వరనే చర్చ
జరుగుతున్నది.
జాతీయ రాజకీయాల ప్రభావం!
రాజకీయాల్లో వ్యూహాలు అధికారిక ప్రకటనల రూపంలో ఉండవు. అవి పరిణామాల క్రమంలోనే కనిపిస్తాయి. అందుకే ఘటనలను విడివిడిగా కాకుండా, ఒకే ఫ్రేమ్‌లో చూస్తే వాస్తవ చిత్రం కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెపున్నారు. ముఖ్యనేత జాతీయ రాజకీయ సమీకరణలను దృష్టిలో పెట్టుకొని కొత్త రాజకీయ అవకాశాలను పరిశీలిస్తున్నారనే ఊహాగానాలు, దానికి అనుగుణంగానే రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. దళిత ఎమ్మెల్యేల ఫిర్యాదులు కొత్తవి కావు. ఇవి నెలలుగా, ఏండ్లుగా ఉన్నవే. కానీ ఇవన్నీ ఏకకాలంలో, అది కూడా అధిష్ఠానం ముఖ్యనేత విషయంలో అలర్ట్ అయిన సమయంలో బయటకు రావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దేశ రాజకీయాల్లో గత దశాబ్దంలో బీజేపీ దళిత సామాజిక వర్గాన్ని తమ వైపునకు తిప్పుకోవడానికి ప్రత్యేక వ్యూహాలు అమలు చేసింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, హర్యానా… ప్రతి రాష్ట్రంలో సామాజిక సమీకరణలే ఎన్నికల లెకలుగా మారాయి. తెలంగాణలో మాత్రం ఇప్పటివరకు బీజేపీ వ్యూహం ఫలించలేదు. ఇకడ దళిత ఓటు ఇప్పటికీ కాంగ్రెస్, బీఆర్ఎస్తోనే ఉన్నది. అలాంటి సమయంలో కాంగ్రెస్‌లోనే దళిత ప్రజాప్రతినిధులు అవమానానికి గురవుతున్నారనే భావన బలపడితే, దాని రాజకీయ ప్రభావాలపై చర్చలు రావడం సహజమేనని అంటున్నారు. అయితే, ఇది ఊహాజనితమా? లేక వ్యూహాత్మక వాస్తవమా? అన్నది ఇప్పుడే తేలేది కాదు; కానీ, రాజకీయాల్లో పొగ లేకుండా నిప్పు రాదనే సత్యాన్ని విస్మరించకూడదు.