రాయికల్, జూలై 26 : సీఎం రేవంత్‌రెడ్డి మంత్రులను కూడా బలి చేస్తాడని, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను నరేంద్ర మోదీ ఎలా చేశాడో ఉత్తమకుమార్‌రెడ్డిని అలా చేస్తాడని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి విమర్శించారు. మంత్రులు ఉత్తమ్, తుమ్మల.. సీఎం ఇచ్చిన స్రిప్ట్ చదువడం కాకుండా శాఖల విషయంలో సొంతంగా ఆలోచన చేయాలని సూచించారు. రేవంత్‌రెడ్డికి తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌పై ఈర్ష్యాద్వేషాలు ఉన్నందునే కాళేశ్వరం ఎత్తపోతలపై నిర్లక్ష్యం చేస్తున్నాడని మండిపడ్డారు. రైతుల హకుల కోసం పంజాబ్, హర్యానా రైతులు ఢిల్లీని ముట్టడించినట్టు తెలంగాణ రైతులు కూడా ఉద్యమాలుచేసే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండల కేంద్రంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సాగు విషయంలో సర్కార్ రోజుకోమాట మాట్లాడుతున్నదని మండిపడ్డారు.
ఎల్ నినో అకస్మాత్తుగా వచ్చింది కాదని, ఆరు నెలల నుంచి వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నా ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని, నివారణ చర్యలు చేపట్టాలని వాతావరణ నిపుణులు కూడా సూచనలు చేసినా వినలేదని విమర్శించారు. మేడిగడ్డ బరేజ్తో సంబంధం లేకుండా 93.5 లెవల్‌తో ప్రవాహం ఉంటే అన్నారం నుంచి సుందిళ్లకు నీళ్లు ఎత్తిపోయవచ్చని చెప్పారు. కన్నెపల్లి పంప్ హౌస్‌కు దిగువన కిలోమీటర్ దూరంలో మేడిగడ్డకు సంబంధం లేకుండా కాపర్ డ్యామ్ 15 రోజుల్లో నిర్మించుకోవచ్చని తెలిపారు. కేవలం రూ.10 కోట్లతో కరువును అధిగమించే అవకాశం ఉందని సూచించారు. నీట్ పేపర్ లీకేజీ విషయంలో మోడీ బాధ్యత వహించాలని అన్నారు. పాత పద్ధతిలో ఎంసెట్ ఉండుంటే ఏ రాష్ట్రంలో లీకేజీ అయితే ఆ రాష్ర్టానికే పరిమితం అయి ఉండేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలే మెడికల్ ఎంట్రెన్స్ నిర్వహించుకునేలా అవకాశం కల్పించాలని డిమాండ్‌చేశారు.