IND vs WI : భారత కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(102 నాటౌట్) తొలి టీ20 శతకంతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ బౌలర్లను ఊచకోత కోసిన అయ్యర్.. విధ్వంసక ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. 171 పరుగుల ఛేదనలో పవర్ ప్లేలోనే అభిషేక్ శర్మ(21), సంజూ శాంసన్(11)లు ఔటైనా.. ఇషాన్ కిషన్(37 నాటౌట్) అండతో చెలరేగాడు అయ్యర్. అర్ధ శతకం తర్వాత మరింత ఉతికేసిన అతడు 42 బంతుల్లో వంద కొట్టేశాడు. దాంతో.. ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందిన టీమిండియా సిరీస్‌లో ముందంజ వేసింది.
లక్నోలోని ఎకానా స్టేడియంలో శ్రేయాస్ అయ్యర్(102 నాటౌట్) శివమెత్తాడు. స్వదేశంలో అఫ్గనిస్థాన్‌పై చెలరేగిన అయ్యర్.. ఈసారి వెస్టిండీస్ బౌలర్ల భరతం పట్టాడు. తొలి టీ20లో విండీస్ నిర్దేశించిన 171 పరుగుల ఛేదనలో శుభారంభం దక్కకున్నా నేనున్నాగా అంటూ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో రెచ్చిపోయాడు. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ అభిషేక్ శర్మ(21)ను రోస్టన్ ఛేజ్ ఔట్ చేయగా.. అకీల్ హొసేన్ ఓవర్లో సంజూ శాంసన్(11) అతడికే రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. పవర్ ప్లేలో.. రెండు కీలక వికెట్లు పడిన వేళ ఇషాన్ కిషన్(37 నాటౌట్), కెప్టెన్ అయ్యర్లు నిలబడ్డారు.
No better way to bring up your maiden T20I ton! 🤩
🎥 Relive Captain Shreyas Iyer’s 𝙢𝙞𝙡𝙚𝙨𝙩𝙤𝙣𝙚 𝙢𝙤𝙢𝙚𝙣𝙩 🔥
Updates ▶️ https://t.co/2czVyKWreK
#TeamIndia | #INDvWI | @mflone_ | @ShreyasIyer15 https://t.co/LGOfKb5SYx
— BCCI (@BCCI) October 6, 2026
వెస్టిండీస్ స్పిన్నర్లను దీటుగా ఎదుర్కొన్న అయ్యర్, ఇషాన్ ద్వయం జట్టును గెలిపించే బాధ్యత తీసుకుంది. కాస్త కుదురుకున్నాక వీరిద్దరూ బౌండరీలతో అలరిస్తూ అర్ధ శతకం భాగస్వామ్యం నెలకొల్పగా పది ఓవర్లు స్కోర్ వంద దాటింది. ఆపై అయ్యర్ విధ్వంసం తారాస్థాయికి చేరింది. హోసేన్ ఓవర్లో 6, 4 బాదిన భారత సారథి ఫోర్డె వేసిన 14 ఓవర్లో మూడు సిక్సర్లు, ఫోర్‌తో విశ్వరూపం చూపించాడు. సెంచరీకి చేరువైన అయ్యర్..లాంగాన్‌లో కళ్లు చెదిరే సిక్సర్‌తో అంతర్జాతీయ టీ20 తొలి వంద నమోదు చేశాడు. ఆ తర్వాత బంతికి అతడు సింగిల్ తీయగా 14.4 ఓవర్లలోనే టీమిండియా జయభేరి మోగించింది. ఎనిమిది వికెట్ల విజయంతో విండీస్‌కు షాకిచ్చిన మెన్ ఇన్ బ్లూ ఐదు టీ20 సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.
టాస్ ఓడిన వెస్టిండీస్‌ను షాయ్ హోప్(52), రూథర్‌ఫొర్డ్(56)లు ఆదుకున్నారు. ధనాధన్ ఆడిన వీరిద్దరూ అర్ధ శతకాలతో మెరిసినా.. విండీస్ 19.1 ఓవర్లకే కుప్పకూలింది. భారత బౌలర్లలో అరంగేట్రం కుర్రాడు నమన్ ధిర్(3-31) రాణించగా.. అక్షర్, కుల్దీప్ తలా రెండేసీ వికెట్లు తీశారు.