హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్‌ని నిరసిస్తూ శనివారం రాత్రి హైదరాబాద్‌లో కాంగ్రెస్ నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీ కంటే, ప్రదర్శించిన బ్యానర్ ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ జాతీయ నాయకత్వం కంటే సీఎం రేవంత్‌రెడ్డి వ్యక్తిగత ప్రచారానికే ప్రాధాన్యత ఇచ్చారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దాదాపు 20 అడుగుల పొడవు, 4 అడుగుల ఎత్తుతో ఉన్న బ్యానర్ మధ్యలో సీఎం రేవంత్‌రెడ్డి పెద్ద బొమ్మను మాత్రమే ముద్రించారు. ఇరువైపులా ‘యూత్ దేశ్ కా’ అనే నినాదాన్ని రాశారు. జాతీయ కాంగ్రెస్ ఉద్యమానికి ప్రతీకగా నిలువాల్సిన బ్యానర్లో పార్టీ అగ్రనేతల చిత్రాలు లేకపోవడం కాంగ్రెస్ అంతర్గత రాజకీయాల్లో మరో చర్చకు తెరతీసింది. ర్యాలీలో ముందున్న భారీ బ్యానర్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒకరి ఫొటో మాత్రమే ముద్రించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంకాగాంధీ వంటి జాతీయ నాయకుల ఫొటోలకు చోటులేకపోవడం పార్టీలో చర్చనీయాంశమైంది. సాధారణంగా జాతీయ అంశాలపై కాంగ్రెస్ పార్టీ చేపట్టే కార్యక్రమాల్లో హైకమాండ్ నాయకుల చిత్రాలకు ప్రాధాన్యత ఇవ్వడం ఆనవాయితీ. అలాంటి సంప్రదాయానికి భిన్నంగా ఈ బ్యానర్ రూపొందించడం వెనుక ఉద్దేశం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
పీసీసీ చీఫ్ అభ్యంతరం
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ బ్యానర్ రూపకల్పనపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అభ్యంతరం వ్యక్తంచేసినట్టు తెలిసింది. జాతీయ నాయకుల చిత్రాలు లేకుండా రాష్ట్ర కాంగ్రెస్ అధికారిక కార్యక్రమం నిర్వహించడం సరైన సంకేతాలు పంపదని ఆయన అభిప్రాయపడినట్టు చెప్తున్నారు. ఢిల్లీలో విద్యార్థుల ఉద్యమానికి మద్దతుగా రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంకాగాంధీ స్వయంగా రోడ్డెకి నిరసన చేపట్టగా, పలువురు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, జాతీయ నాయకులు ఢిల్లీకి చేరుకొని సంఘీభావం ప్రకటించారు. కానీ, తరచూ ఢిల్లీ పర్యటనలు చేసే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాత్రం ఆ కార్యక్రమానికి దూరంగా ఉండటం అప్పుడే చర్చకు దారితీసింది. ఇప్పుడు ఢిల్లీకి వెళ్లకుండా హైదరాబాద్‌లో నిర్వహించిన నిరసనలో కూడా తన ఒకరి ఫొటోకే ప్రాధాన్యత ఇవ్వడం ఆ చర్చను మరింత తీవ్రం చేసిందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. విద్యార్థుల పోరాటాన్ని జాతీయ స్థాయిలో బీజేపీపై రాజకీయ ఆయుధంగా మలచాలని కాంగ్రెస్ అధిష్ఠానం ప్రయత్నిస్తున్న సమయంలో, తెలంగాణలో మాత్రం సీఎం వ్యక్తిగత ఇమేజ్ చుట్టూనే తిరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ కంటే వ్యక్తి కనిపించడం వెనుక రాజకీయ సందేశం ఏమిటన్న చర్చ సాగుతున్నట్టు సమాచారం. ఈ బ్యానర్ ప్రదర్శన మీద పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ఢిల్లీకి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఆయన వివరణ కోసం ఫోన్లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.