Congress | హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్‌లో అసలు, వలస నేతల మధ్య ఆధిపత్యపోరు పతాకస్థాయికి చేరింది. అధికారంలోకి వచ్చింది మొదలు వలస నేతలు ప్రభుత్వంపై పట్టు సాధించారని, అటు పార్టీ పదవుల్లో, ఇటు ప్రభుత్వపరమైన పదవుల్లోనూ వారికే ప్రాధాన్యం లభిస్తున్నదని, అసలు కాంగ్రెస్ నేతలను ఇబ్బందులు పెడుతున్నారన్న వాదనలు ఉన్నాయి. డీసీసీ అధ్యక్షుల నుంచి మొదలు ఇటీవల జరిగిన రాజ్యసభ వరకు వలస కాంగ్రెస్ నేతలకే పెద్దపీట వేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. టీపీసీసీ పూర్తిగా ముఖ్యనేత చేతిలో కీలుబొమ్మగా మారిందని, పదవులు ఏవైనా ఆయన వర్గం తయారు చేసిన జాబితా మీద రబ్బర్ స్టాంపు వేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిణామాలపై సీనియర్లు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారనేది బహిరంగ రహస్యమే. దీంతో ఇందులో భాగంగానే కొందరు నేతలు తరచూ ధికారస్వరం వినిపిస్తున్నారని, కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ప్రభుత్వ నిర్ణయాలపై బహిరంగ విమర్శలు చేస్తున్నారని చెప్తున్నారు.
ఈ నేపథ్యంలో ఢిల్లీ దూత అసలు కాంగ్రెస్ నేతలతో చర్చించి, వారి అభిప్రాయాలను ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్లినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ప్రభుత్వాన్ని, పార్టీని సమన్వయం చేయకుంటే భవిష్యత్తు ఆందోళనకరంగా ఉంటుందని హెచ్చరించినట్టు సమాచారం. సీనియర్ నాయకులను, ప్రభుత్వాన్ని సమన్వయం చేసేందుకు తక్షణమే కమిటీ ఏర్పాటుచేయాలని, ఇందులో సీనియర్ కాంగ్రెస్ నేతలను మాత్రమే సభ్యులుగా నియమించాలని ఏఐసీసీకి స్పష్టం చేసినట్టు చెప్తున్నారు. అయితే కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ ప్రతిపాదనలను ఢిల్లీ పెద్దలు పక్కన పెట్టినట్టు తెలిసింది. కేరళ ఎన్నికల వ్యవహారాల్లో తెలంగాణ సహకారమే ఎక్కువ అవసరమని, ఈ పరిస్థితిలో అసలు కాంగ్రెస్ నేతలకు ప్రాముఖ్యత ఇచ్చేలా నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు పడతామని వారించినట్టు ప్రచారం జరుగుతున్నది. అగ్రనేత సైతం అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వా తే కమిటీ గురించి ఆలోచిద్దామని స్పష్టం చేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, పార్టీ కోసం సర్వం త్యాగం చేసిన మాజీ మంత్రి జీవన్‌రెడ్డి కొన్నాళ్లుగా అలక వహించిన సంగతి తెలిసిందే. ఆయన ఏకంగా పార్టీని వీడుతున్నారన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనతోపాటు మరికొంత మంది నాయకులు కూడా పార్టీ నుంచి వెళ్లిపోయే పరిస్థితులు ఉన్నాయని ఢిల్లీ దూత ఏఐసీసీకి తెలియజేసినట్టు సమాచారం. ఇందులో భాగంగానే దక్షిణ తెలంగాణకు చెందిన 9 మంది ఎమ్మెల్యేలు రహస్య సమావేశం పెట్టుకున్నారని, వీరితో మరో ముగ్గురు ఎమ్మెల్యేలు జత కలుస్తారని, అదే జరిగితే ప్రభుత్వ మనుగడకే ప్రమాదమని హెచ్చరించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో ఢిల్లీ కాంగ్రెస్ నేతలు ఉలిక్కిపడ్డారని, దిద్దుబాటు చర్యలకు దిగారని చెప్పుకొంటున్నారు. గతంలో ఢిల్లీ దూత పంపిన ప్రతిపాదనలను తెరమీదికి తెచ్చారని, సీనియర్ నేతలు, ప్రభుత్వం మధ్య సమన్వయం కోసం ఒక కమిటీని వేయాలని నిర్ణయించారని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి.
సమన్వయ కమిటీలో ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడితోపాటు మరో ఆరుగురు సీనియర్ కాంగ్రెస్ నేతలను సభ్యులుగా తీసుకోవాలని ఢిల్లీ దూత ప్రతిపాదించినట్టు తెలిసింది. ఇందుకోసం మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్‌తోపాటు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తదితర అసలు కాంగ్రెస్ నేతల పేర్లను సిఫార్సు చేసినట్టు తెలిసింది. అయితే, ఈ జాబితాపై కేరళ సీఎం అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న ఏఐసీసీ నేత అడ్డం పడినట్టు తెలిసింది. పూర్తిగా అసలు కాంగ్రెస్ నేతలనే కమిటీలో పెడితే వలస నేతలకు ప్రతికూల సంకేతాలు పంపినట్టు అవుతుందని, అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇలాంటి చర్యలు మంచిది కాదని ఢిల్లీ పెద్దలకు చెప్పినట్టు సమాచారం. దీంతో మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ను పక్కన పెట్టి వారి స్థానంలో మంత్రి సీతక్క, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీనటరాజన్, వంశీచంద్‌రెడ్డి పేర్లను చేర్చినట్టు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. అయినా ముఖ్యనేత సంతృప్తి చెందలేదని, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వంశీచంద్‌రెడ్డి పేర్లపై అభ్యంతరం తెలుపుతూ ఢిల్లీ పెద్దలకు తన అభిప్రాయాన్ని తెలియజేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో కమిటీ ఏర్పాటు వ్యవహారం.. ‘విడవమంటే పాముకు కోపం, కరవమంటే కప్పకు కోపం’ అన్న చందంగా తయారైందని ఏఐసీసీ పెద్దలు భావిస్తున్నారట. సీనియర్లను కాదనలేమని, ముఖ్యనేత మాటను పక్కన పెట్టలేమని చెప్తున్నారట. మొత్తంగా పరిస్థితిని చక్కదిద్దే పేరుతో ఏర్పాటుచేసే కమిటీతో ఎలాంటి పరిణామాలు ఉంటాయోనని కాంగ్రెస్ వర్గాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.