నాగార్జునసాగర్ డ్యాం సగటు నీటి సమాచారం
నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 ( 315.0450 టీంసీలు) అడుగులకుగాను ప్రసుత్తం 513.70 అడుగుల వద్ద 138.0384 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నాగార్జున సాగర్ డ్యాం నుంచి జలవిద్యుత్ కేంద్రాలు కుడి, ఎడమ కాల్వల ద్వారా నీటి విడుదల లేదు. ఎస్ఎల్బీసీ ద్వారా 900 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయం 885 అడుగులకుగాను ప్రస్తుతం 874 అడుగుల మేర నీరు నిల్వ ఉంది. శ్రీశైలానికి 2,09,782 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుండగా జలవిద్యుత్ కేంద్రం ద్వారా 3,421 క్యూసెక్కుల అవుట్ ఫ్లో దిగువన ఉన్న నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు కొనసాగుతోంది.
నందికొండ, ఆగస్టు 7 : నాగార్జునసాగర్ రిజర్వాయర్ డెడ్ స్టోరేజీకి చేరడంతో కాల్వల ద్వారా ఆయకట్టుకు సాగు నీరందే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆయకట్టు రైతాంగం సాగు కోసం నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు వచ్చే వరద నీటి కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొన్నది. ప్రస్తుతం సాగర్ రిజర్వాయర్ డెడ్ స్టోరేజీకి 510 అడుగులకు గాను 513 అడుగులకు చేరింది. దీంతో డ్యాం కాల్వల ద్వారా ఆయకట్టుకు నీరందే అవకాశం లేదు. జూరాల నుంచి శ్రీశైలం రిజర్వాయర్‌కు పది రోజులుగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో శ్రీశైలం రిజర్వాయర్ నీటి మట్టం 820 అడుగుల నుంచి 874 అడుగులకు చేరింది. జూరాల నుంచి 2 లక్షల క్యూసెక్కులకుపైగా వరద నీరు శ్రీశైలం ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండటంతో రోజుకు 6 అడుగు మేర నీటి మట్టం పెరుగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులో వరద నీరు నిలకడగా ఉంటే మరో నాలుగు రోజుల్లో పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగలకు చేరుతుంది. దీంతో మరో వారం రోజుల్లో శ్రీశైలం డ్యాం గేట్ల ద్వారా దిగువన ఉన్న నాగార్జున సాగర్ రిజర్వాయర్‌లోకి నీటిని విడుదల చేసే అవకాశం ఉందని ఎన్ఎస్పీ అధికారులు అంచనా వేస్తున్నారు.
వానకాలం పంటలను ఇప్పటికే సాగు చేయాల్సి ఉండగా వానలు లేకపోవడం, నాగార్జునసాగర్ రిజర్వాయర్‌లో నీరు డెడ్ స్టోరేజీలో ఉండటంతో వరి సాగుచేయాలా.. వద్దా అనే ఆలోచనలో రైతులు ఉన్నారు. వరద నిలకడగా కొనసాగితే శ్రీశైలం రిజర్వాయర్ నుంచి వారం రోజుల్లో వరద నీటి ప్రవాహనం సాగర్ రిజర్వాయర్‌లోకి చేరుతుంది. సాగర్ రిజర్వాయర్ 513 అడుగల నుంచి 550 అడగులకు చేరితే ఎడమ కాల్వకు నీరు విడుదల చేసే అవకాశం ఉంటుంది. వరద నిలకడగా కొనసాగితే నెల చివరి వారం లోగా సాగర్ రిజర్వాయర్ ద్వారా కాల్వలకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. కాల్వలకు నీరు విడుదలైతే వానకాలంలో ఆలస్యమైనా వరి సాగు చేసుకొవచ్చని రైతులు ఆశిస్తున్నారు.