Rahul Gandhi : బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) నేపథ్యంలో లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ (Congress MP) రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆ రాష్ట్రంలో భారీ యాత్రను మొదలుపెట్టారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పేరుతో ఓటరు జాబితాను సవరించి, పౌరుల ఓటు హక్కును దోచుకుంటున్నారని ఆరోపిస్తున్న ఆయన ‘ఓట్ అధికార్ యాత్ర’ పేరుతో యాత్ర నిర్వహిస్తున్నారు.
ఇవాళ (ఆదివారం) ససారాం నగరం నుంచి యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్ర 16 రోజులపాటు 1,300 కిలోమీటర్ల దూరం 25 జిల్లాల మీదుగా కొనసాగనుంది. వచ్చే నెల 1న పట్నాలో నిర్వహించే భారీ సభతో యాత్ర ముగుస్తుంది. రాహుల్‌తోపాటు ఇండియా కూటమిలో భాగస్వాములైన ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, మూడు వామపక్ష పార్టీల నేతలు యాత్రలో పాల్గొంటారు. కాలినడకతోపాటు వాహనాల్లో ప్రయాణిస్తూ రాహుల్ ఈ యాత్రను కొనసాగిస్తారు.
ఇదిలావుంటే ఓటు హక్కుపై ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమంలో భాగంగా శనివారం రాహుల్‌గాంధీ ‘లాపతా ఓటు’ (గల్లంతైన ఓటు) పేరుతో ‘ఎక్స్’లో ఒక వీడియోను షేర్ చేశారు. ఓట్ల చోరీకి వ్యతిరేకంగా పోరాడి, మన హక్కులను కాపాడుకుందామని రాహుల్ ఆ వీడియోలో పిలుపునిచ్చారు.