Adivi Sesh | వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో అడివి శేష్ ఇప్పుడు మరో ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం డెకాయిట్ ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమాలో హీరోయిన్గా మృణాట్ ఠాకూర్ నటిస్తోంది. తాజాగా జరిగిన ప్రెస్ మీట్లో ఈ సినిమా గురించి అడివి శేష్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సినిమాలో బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో నటించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఆయన ఈ ప్రాజెక్ట్‌లోకి ఎలా వచ్చారన్నది ఆసక్తికరంగా మారింది.
అడివి శేష్ తెలిపిన వివరాల ప్రకారం, హీరో నాగ చైతన్య వివాహ వేడుకలో అనురాగ్ కశ్యప్‌ను కలిసినప్పుడు ‘డెకాయిట్’ కథను ఆయనకు వినిపించారట. కథలోని ఎమోషన్ మరియు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ నచ్చడంతో అనురాగ్ కశ్యప్ వెంటనే ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పారు. దాదాపు 149 రోజుల పాటు ఈ సినిమాకు షూటింగ్ నిర్వహించామని, విడిపోయిన ఇద్దరు ప్రేమికుల జీవితాల చుట్టూ తిరిగే థ్రిల్లింగ్ లవ్ స్టోరీగా ఈ చిత్రం రూపొందిందని శేష్ వివరించారు. ఈ సినిమాలో హలో బ్రదర్ చిత్రంలోని సూపర్ హిట్ పాట కన్నెపిట్టరో కన్ను కొట్టరో పాటను రీమిక్స్ చేయడం కూడా చర్చనీయాంశమైంది. దీనిపై సంగీత దర్శకుడు కోటీ అప్పట్లో అసహనం వ్యక్తం చేయడం పెద్ద వివాదానికి దారి తీసింది.
ఈ అంశంపై నిర్మాత సుప్రియ యార్లగడ్డ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. ఆ పాట హక్కులు ఆదిత్య మ్యూజిక్ వద్ద ఉన్నాయని, వారివద్ద నుంచి అధికారికంగా అనుమతి తీసుకుని రీమిక్స్ చేశామని తెలిపారు. అలాగే కోటి గారిని వ్యక్తిగతంగా కలిసి మాట్లాడామని, ప్రస్తుతం ఆ వివాదం సద్దుమణిగిందని చెప్పారు. ఈ పాటను సంగీత దర్శకుడు గ్యాని అద్భుతంగా రీమిక్స్ చేశారని, అది సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని వెల్లడించారు. ఇక ఈ సినిమాలో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటతో పాటు అనురాగ్ కశ్యప్, ప్రకాశ్ రాజ్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా, అడివి శేష్ చివరిగా హిట్: ది సెకండ్ కేసు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు.