కొల్లాపూర్, ఆగస్టు 2 : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, ప్రముఖ పర్యాటక ప్రాంతమైన సోమశిల వద్ద కృష్ణానది ఒడ్డున అక్రమ మైనింగ్ దందా యథేచ్ఛగా సాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా జేసీబీలతో లోతైన గుంతలు తవ్వుతూ ట్రాక్టర్ల ద్వారా మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. పర్యాటక ప్రాంతంలో అక్రమ తవ్వకాలు జరుగుతున్న సంబంధిత శాఖల అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. పర్యాటక రంగం పేరుతో గుర్తింపు పొందిన ఈ ప్రాంతంలో ఆదివారం పర్యాటకుల సంఖ్య అధికంగా ఉన్న సమయంలోనే పట్టపగలు జేసీబీల సహాయంతో కృష్ణానదిలో ఇష్టారీతిన తవ్వకాలు జరపడాన్ని చూసిన పర్యాటకులు అసహనం వ్యక్తం చేశారు. నది పరివాహక ప్రాంతంలో గుంతలు తవ్వడంతో కృష్ణానది రూపురేఖలు మారిపోతున్నాయి.
రెండు తెలుగు రాష్ర్టాల నుంచి వేలాది మంది పర్యాటకులు, భక్తులు సోమశిలకు తరలివస్తుంటారు. ఇక్కడ నదీ స్నానాలు చేయడం, బోటింగ్ చేయడం పర్యాటకులకు ఎంతో ఇష్టం. అయితే ప్రస్తుతం నదిలో నీటి మట్టం తక్కువగా ఉండటాన్ని ఆసరాగా చేసుకున్న అక్రమార్కులు యంత్రాలతో లోతైన గుంతలు తీస్తూ మట్టి ని తోడేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో గుంతలు పూర్తిగా కొద్ది రోజులలోనే నీటితో నిండిపోతాయి. నీటితో నిండిన ఈ గుంతలు పర్యాటకులకు కనిపించే అవకాశం లేదు.
ఇప్పటికే సోమశిల అందాలను తిలకించేందుకు వస్తున్న పర్యాటకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. స్నానానికి దిగే పర్యాటకులు, ముఖ్యంగా చిన్నపిల్లలు, ఈత రానివారు అనుకోకుండా తక్కువ నీళ్లు ఉన్నాయని భావించి అక్రమార్కులు తీసిన గోతుల్లో దిగితే మునిగిపోయే ప్రమాదం ఉంది. అంతేకాదు ప్రభుత్వానికి చెందిన పర్యాటక బోట్లతో పాటు, స్థానికంగా ఉండే వారి బోట్లు కూడా గుంతల మట్టిగడ్డలకు తగిలినప్పుడు బోల్తా పడే అవకాశం ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. గతం లో సోమశిల నదీ తీరంలో అనేక మంది ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయిన ఘ టనలు ఉన్నాయి. ఇప్పుడు అక్రమార్కులు తీస్తున్న గు ంతలు పర్యాటకులు, భక్తుల పాలిట మృత్యుహారాలుగా మారే ప్రమాదం ఉందని పలువురు పేర్కొంటున్నారు.
నది పరిహవాక ప్రాంతాలు, ప్రభుత్వ భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా యంత్రాలు ఉపయోగించి తవ్వకాలు జరపడం చట్టరీత్యా నేరం, కానీ సోమశిల నదీ తీరంలో పగలు, రాత్రి తేడా లేకుండా జేసీబీలతో మట్టిని తరలిస్తున్న మట్టి మాఫియాను కట్టడి చేయలేని స్థితిలో సంబంధిత శాఖల అధికారులు ఉన్నారని ప్రజా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. మామూళ్ల మత్తులో అధికారులు ఉండటంతోనే కంటిముందే నదిలో అక్రమ గుంతలు తీస్తున్నా మౌనం పా టిస్తున్నారని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. అక్రమంగా తవ్వకాలు జరుపుతున్న వారి వాహనాలను సీజ్ చేయడంతోపాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. నిత్యం పర్యాటకులు పర్యటించే తీరంలో ఎలాంటి ప్రమాదం జరగకుండా తీసిన గుంతలను మట్టితో నింపి ప్రమాదాలు జరగకుండా అరికట్టాలని పలువురు కోరుతున్నారు.
ప్రభుత్వాలు ఒక వైపు సోమశిలను అంతర్జాతీయ స్థాయిలో టూరిజం హబ్‌గా తీర్చిదిద్దాలని కోట్ల రూపాయాలు వెచ్చిస్తుంటే.. మరో వైపు మట్టి మాఫియా ఆగడాల వల్ల భవిష్యత్‌లో ఏదైనా అవాంఛనీయ ఘటన చోటుచేసుకొని పర్యాటకులు ప్రాణాలు కోల్పోతే, సోమశిల పర్యాటక రంగం తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉం టుంది. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం, జిల్లా ఉన్నత అధికారులు తక్షణమే జోక్యం చేసుకొని అక్రమ మైనింగ్‌కు చెక్ పెట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.