తైవాన్ : భారత యువ బ్యాడ్మింటన్ సంచలనం తన్వి శర్మ తైపీ ఓపెన్‌లో సరికొత్త చరిత్ర సృష్టించింది. తైవాన్‌లో జరిగిన తైపీ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో ఆమె మహిళల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకుంది. పూర్తి ఏకపక్షంగా సాగిన ఫైనల్లో తన్వి.. 21-16, 21-16తో ఆరో సీడ్ లిన్ ఎన్గుయెన్ (వియత్నాం)ను వరుస సెట్లలో చిత్తుచేసి తన కెరీర్లో తొలి బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. గతంలో యూఎస్ ఓపెన్ 300 టోర్నీలో ఫైనల్ చేరినా రన్నరప్‌తో సరిపెట్టుకున్న తన్వి.. ఈసారి మాత్రం పట్టు వీడకుండా ఆడి 36 నిమిషాల్లోనే ప్రత్యర్థిని చిత్తుచేసింది. తాజా విజయంతో టోర్నీలో ఈ పంజాబ్ అమ్మాయి భారత 18 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. 2008లో హైదరాబాదీ షట్లర్ సైనా నెహ్వాల్ తర్వాత ఈ టోర్నీలో టైటిల్ నెగ్గిన తొలి భారత షట్లర్‌గా గుర్తింపు సాధించింది. అంతేగాక అత్యంత పిన్న వయసు (17 ఏండ్ల 222 రోజులు)లోనే తైపీ ఓపెన్ గెలిచిన షట్లర్‌గానూ రికార్డులకెక్కింది. 2006లో కొరియా ప్లేయర్ లీ యాంగ్ డె 17 ఏండ్ల 287 రోజులకు సింగిల్స్‌లో విజేతగా నిలువగా తన్వి ఆ రికార్డును బ్రేక్ చేసింది.
తనకంటే మెరుగైన ర్యాంకు కల్గిన ప్రత్యర్థులను చిత్తుచేస్తూ ఫైనల్ చేరిన తన్వి.. టైటిల్ పోరులోనూ అదే జోరు కొనసాగించింది. ప్రత్యర్థిని నెట్ దగ్గరికి తీసుకొచ్చి బోల్తా కొట్టిస్తూ ఆరంభంలోనే 4-1 ఆధిక్యం సాధించిన ఆమె ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోవ్సాలిన అవసరమే రాలేదు. అద్భుతమైన క్రాస్ కోర్ట్ స్మాష్‌లకు తోడు డ్రాప్ షాట్లతో ఆధిక్యాన్ని 10-2కు పెంచుకుంది. ఆ తర్వాత కాస్త తడబడటంతో వియత్నాం అమ్మాయి పుంజుకునే యత్నం చేసింది. కానీ వెంటనే తేరుకున్న తన్వి.. వరుసగా ఐదు గేమ్ పాయింట్లతో తొలి గేమ్‌ను తన ఖాతాలో వేసుకుంది. రెండో గేమ్ ప్రారంభంలోనే ఎన్గుయెన్ 3-0తో ఆధిక్యంలోకి వెళ్లినా భారత షట్లర్ క్రమంగా పుంజుకుంటూ స్కోర్లను సమం చేసి 8-7తో ఆధిక్యంలోకి వచ్చింది. ఈ సమయంలో తన్వి.. రెండు అద్భుతమైన విన్నర్లతో విరామ సమయానికి 11-8తో ఆధిక్యత సాధించింది. నెమ్మదిగా ఆధిక్యాన్ని పెంచుకుంటూ వెళ్లిన భారత అమ్మాయి.. రెండో గేమ్‌తో పాటు మ్యాచ్‌నూ సొంతం చేసుకుంది. కాగా తనకు బంగారు పతకం దక్కిన అనంతరం ఆమె.. దానిని తీసుకెళ్లి పక్కనే ఉన్న కోచ్ పార్క్ టె సాంగ్ మెడలో వేసి గురుభక్తిని చాటి అందరి మనసులు గెలుచుకోవడం కొసమెరుపు.