Sridhar Babu | హైదరాబాద్, మార్చి 17(నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు పదే పదే ఢిల్లీకి వెళ్తుండటంపై శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘జాతీయ పార్టీగా అధిష్ఠానం ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లాల్సిందే. ఒకవేళ పిలిచినప్పుడు ఢిల్లీకి వెళ్లకపోతే మా ఉద్యోగాలు ఊడిపోతయి. మాకు ఉద్యోగాలు ఎవరిస్తారు?’ అని వ్యాఖ్యానించారు.
అసెంబ్లీ మీడియా హాల్లో మంగళవారం ఆయన మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధామిచ్చారు. పారిశ్రామిక భూముల అమ్మకానికి సంబంధించిన హిల్ట్ పాలసీ అమలును ఇంకా మొదలుపెట్టలేదని తెలిపారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ బీఆర్ఎస్లో ఉన్నారా? కాంగ్రెస్‌లో ఉన్నారా? అనే ప్రశ్నకు స్పందిస్తూ, ఆయన బీఆర్ఎస్లోనే ఉన్నట్టు స్పీకర్ తీర్పు ఇచ్చారని, కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై పార్టీతో కలిసి పని చేస్తున్నారని అన్నారు.
పదేండ్లపాటు తానే ముఖ్యమంత్రినని రేవంత్‌రెడ్డి చెప్పుకోవడంపై స్పందిస్తూ… సీఎం కుర్చీలో కూర్చున్న వ్యక్తి మరికొంత కాలం ఆ కుర్చీలో కూర్చోవాలనుకోవడం సహజమని, కానీ, కాంగ్రెస్ పార్టీలో సీఎం ఎంపిక అధిష్ఠానం చేతుల్లో ఉంటుందని చెప్పారు. మంత్రివర్గ విస్తరణపై ప్రశ్నించగా, తన పదవే ఉంటుందో ఊడుతుందో తెలియదని, అలాంటిది మంత్రివర్గ విస్తరణపై తానేం సమాధానం చెప్తానని వ్యాఖ్యానించారు. దీనిపై అంతా అధిష్ఠానం చూసుకుంటుందని, తాను ప్రభుత్వంలో ఒక సాధారణ, చిన్న మంత్రినని పేర్కొన్నారు. ఇప్పసారాకు సంబంధించి ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి చేసిన ప్రతిపాదన బాగున్నదని, ప్రభుత్వానికి, ప్రజలకు మేలు జరిగితే అమలు చేస్తామని తెలిపారు. రెండు మూడు రోజుల్లో అసెంబ్లీ కమిటీలు ఏర్పాటు చేస్తామని, నామినేటెడ్ పోస్టుల భర్తీపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
సీనియర్ కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి వివాదంపై మంత్రి శ్రీధర్‌బాబు స్పందిస్తూ… ఆయన మనస్తాపం చెందిన విషయం వాస్తవమని అంగీకరించారు. అందుకు కారణమేమిటో తెలుసుకొని పరిష్కరించాల్సిన బాధ్యత ఏఐసీసీ పెద్దలపై, ఇక్కడ పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌పై ఉన్నదని స్పష్టంచేశారు. జీవన్‌రెడ్డి పదవుల కోసం ఇలా చేసే వ్యక్తి కాదని, ఆయన ఫలానా పదవి కావాలని కోరుకుంటే తెచ్చుకునేందుకు రెండు నిమిషాలు చాలని వ్యాఖ్యానించారు. జీవన్‌రెడ్డి విషయంలో పార్టీ పెద్దగా పీసీసీ చీఫ్ చొరవ తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే ఆయనతో మాట్లాడాల్సి ఉండెనని, జీవన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి పెద్ద అసెట్ (ఆస్తి) అని పేర్కొన్నారు. నాడు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో శాసనమండలిలో జీవన్‌రెడ్డి ఒక్కరే పోరాటం చేశారని గుర్తుచేశారు.
బ్రాహ్మణులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేలు చేసిన వ్యాఖ్యలపై శ్రీధర్‌బాబు స్పం దిస్తూ.. ఆయన వ్యాఖ్యల్ని ఖండించారు. ఇప్పటికే దీనిపై సామేలు క్షమాపణ చెప్పారని పేర్కొన్నారు. ఏ వర్గంపైనా అలాంటి వ్యాఖ్యలు చేయొద్దని హితవు చెప్పారు. అయితే ఆయన క్షమాపణ చెప్పలేదని, విచారం మాత్రమే వ్యక్తం చేశారని విలేకరులు చెప్పగా.. అలా అయితే ఆయన వివరణ ఇవ్వాల్సిన ధర్మం ఉంటుందని, ఇవ్వాలని వ్యాఖ్యానించారు. మందుల సామేలు క్షమాపణ చెప్పాలని పరోక్షంగా శ్రీధర్‌బాబు సూచించారు.
అసెంబ్లీ లాబీ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రుల ద్వారా మీడియా ప్రతినిధులకు లీకులు వెళ్తున్నాయనే అభిప్రాయం ప్రభుత్వ పెద్దల్లో ఉన్నది. ఈ నేపథ్యంలో లాబీలోకి మీడియా ప్రతినిధులను అనుమతించకుండా ఉండేందుకు ప్రభుత్వం కొత్త ప్రణాళికను అమలు చేస్తున్నది. ఈ మేరకు అసెంబ్లీ లాబీని పార్లమెంట్ తరహాలో సెంట్రల్ హాల్‌గా మార్చుతున్నట్టు మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒకే దగ్గర ఉండేలా హాల్‌ను రూపొందిస్తామని చెప్పారు. అయితే ‘మమ్మల్ని బయటకు పంపించేస్తున్నారా?’ అని మీడియా ప్రతినిధులు అనడంతో, మంత్రి నర్మగర్భంగా వ్యాఖ్యలు చేశారు. ఇక్కడే ఎక్కడైనా అకామిడేట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. దీనిపై విలేకరులు స్పందిస్తూ, ‘మొత్తానికి మమ్మల్ని అసెంబ్లీ బయటకు పంపిస్తున్నారు కదా’ అంటూ ఒకింత అసంతృప్తి వ్యక్తంచేశారు.