Snake | మక్తల్: మక్తల్ మండలంలోని కాట్రేపల్లి ప్రాథమికోన్నత పాఠశాల (Primary School)లోని ఓ తరగతి గదిలోకి గురువారం పాము వచ్చింది. పామును చూసిన విద్యార్థులు భయాందోళన చెందారు. వారు వెంటనే ప్రధానోపాధ్యాయుడు నర్సిరెడ్డికి తెలిపారు. ఆయన గ్రామంలోని యువకులకు ఈ విషయం చెప్పడంతో వారు వచ్చి పామును చంపారు. ఈ విషయాన్ని ఉపాధ్యాయులు గోప్యంగా ఉంచాలనుకున్నారు.
నారాయణపేట జిల్లా, నారాయణపేట మండలంలోని ఏ క్లాస్ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం (Thursday) మధ్యాహ్నం మూడో తరగతి చదువుతున్న రంజిత్ అనే విద్యార్థికి పాము కాటు వేసింది. అతడు చికిత్స పొందుతూ మృతిచెందిన విషయాన్ని గుర్తు చేసుకున్న ఉపాధ్యాయులు శుక్రవారం తమ పాఠశాలలో కి పాము వచ్చిన విషయాన్ని బయటపెట్టారు.
ఉపాధ్యాయులు తమ పాఠశాలలోకి పాము వచ్చిన విషయాన్ని ఆలస్యంగా బయటకు తెలియజేయడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు (Parents) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల పరిసరాల ఇరువైపులా పూర్తిస్థాయిలో ముళ్లపొదలు ఉండటం వల్లనే పాములు, విషపురుగులు పాఠశాలలోకి వస్తున్నాయి. దీంతో తమ పిల్లలకు ప్రమాదం పొంచి ఉన్నదని, అధికారులు స్పందించి పాఠశాల ఆవరణతోపాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని వారు కోరుతున్నారు. విద్యార్థులకు ఎలాంటి ప్రాణహాని లేకుండా చూడాలని వారు అధికారులకు విన్నవిస్తున్నారు.