Dahi Handi : ఈ నెల 16న శ్రీకృష్ణ జన్మాష్టమి. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో పెరుగు కుండను పగులగొడుతారు. శ్రీకృష్ణుడు పెరుగు, వెన్నలను దొంగిలించి తినేవాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు పెరుగు కుండను పగులగొట్టడం అనేది ఆచారంగా కొనసాగుతోంది. పెరుగు కుండను పగులగొట్టే ఉత్సవాన్నే తెలుగు రాష్ట్రాల్లో ఉట్టి కొట్టడం అంటారు.
మహారాష్ట్ర సహా కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో ‘దహీ హండీ’ పేరుతో జరుపుకుంటారు. ఈ ఉట్టి కొట్టడం అనేది కూడా కొన్ని చోట్ల ఘనంగా జరుగుతుంది. శిక్షణ పొందిన బృందాలు మానవ పిరమిడ్‌గా ఏర్పడి ఉట్టి కొడుతాయి. అందుకోసం కొన్ని రోజుల ముందు నుంచే ప్రాక్టీస్ చేస్తారు. ఇలా ప్రాక్టీస్ చేసే క్రమంలోనే మహారాష్ట్ర రాజధాని ముంబైలోని దహిసర్ ఏరియాలో మహేశ్ జాదవ్ అనే 11 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.
ప్రాక్టీస్ చేస్తుండగా జారిపడ్డ జాదవ్ తలకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు ప్రాణాలు విడిచాడు. ఎలాంటి రక్షణ ఏర్పాట్లు లేకుండా ప్రాక్టీస్ చేయడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఘటనపై ప్రమాదవశాత్తు మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు.