హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ) : పైరసీ భూతాన్ని అంతం చేసేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్బీ) నడుం బిగించింది. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన కీలక సమావేశంలో పైరసీ కేసుల దర్యాప్తు కోసం ప్రత్యేకమైన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(ఎస్వోపీ), థియేటర్లలో ప్రదర్శించే నూతన యాంటీ-పైరసీ డిస్క్లైమర్ను సీఎస్బీ డైరెక్టర్ శిఖాగోయల్, తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు డీ సురేశ్‌బాబు ప్రారంభించారు. సినిమాల పైరసీని అడ్డుకోవడంలో లా ఎన్ ఫోర్స్మెంట్ ఏజెన్సీలు, ఫిల్మ్ ఎకోసిస్టమ్ మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తామని శిఖాగోయెల్ చెప్పారు. పైరసీతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఏడాదికి రూ.3,700 కోట్ల నష్టం, భారతీయ సినిమా ఇండస్ట్రీకి రూ.22,400 కోట్లకు పైగా నష్టం వాటిల్లుతున్నదని పేర్కొన్నారు.ఎస్‌వోపీలో కాపీరైట్ యాక్ట్, సినిమాటోగ్రాఫ్ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ నిబంధనల కింద ఎఫ్ఐఆర్ నమోదు ఉంటుంది.
హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని కేజీబీవీలకు బంకర్ బెడ్ల సరఫరా కోసం ప్రైవేట్ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని హైకోర్టు సమర్థించింది. కేజీబీవీలకు 45,360 బంకర్ బెడ్లతోపాటు పరుపులు, దిండ్లు సరఫరా నిమిత్తం మఫత్‌లాల్ ఇండస్ట్రీస్, ట్రూఫా టెండర్ప్రైజెస్ సంస్థలతో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలను సవాలు చేస్తూ తెలంగాణ స్మాల్సేల్ ఇండస్ట్రీస్ స్టీల్ అండ్ ఉడెన్ ఫర్నిచర్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్‌తోపాటు మరికొందరు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ సూరేపల్లి నంద ఇటీవల విచారణ చేపట్టారు. టెండర్ కేటాయింపు, ఒప్పందం అమలులో ప్రభుత్వానికి దురుద్దేశం ఉన్నట్టు ఆధారాలు లేవని పేర్కొన్నారు. పిటిషన్ కొట్టివేస్తూ తీర్పు వెలువరించారు.
నాంపల్లి క్రిమినల్ కోర్టులు, మార్చి 16 (నమస్తే తెలంగాణ): సినీనటి ప్రత్యూష (22) మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు మేరకు నిందితుడు సిద్ధార్థరెడ్డి సోమవారం నాంపల్లి జిల్లా కోర్టులో లొంగిపోయాడు. అమెరికాలో స్థిరపడిన సిద్ధార్థరెడ్డి 24 ఏండ్ల తర్వాత భారత్‌కు విచ్చేసి కోర్టు ఎదుట హాజరయ్యారు. ఈ కేసులో సిద్ధార్థరెడ్డికి దిగువ కోర్టు విధించిన ఐదేండ్ల జైలుశిక్షను హైకోర్టు రెండేండ్లకు తగ్గించడంపై ప్రత్యూష తల్లి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో సిద్ధార్థరెడ్డికి రెండేండ్ల జైలుశిక్షనే ఖరారు చేస్తూ గత నెలలో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడంతోపాటు 4 వారాల్లోగా దిగువకోర్టులో లొంగిపోవాలని నిందితుడిని ఆదేశించింది. ఆ తీర్పు మేరకు సోమవారం న్యాయవాదుల సమక్షంలో జిల్లా కోర్టులో లొంగిపోయిన సిద్ధార్థరెడ్డిని అధికారులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో తొలిసారి 2004లో నాంపల్లి క్రిమనల్ కోర్టుకు హాజరైన సిద్ధార్థరెడ్డి.. అప్పట్లో బెయిల్ మంజూరయ్యే వరకు దాదాపు నాలుగున్నర నెలల పాటు చంచల్‌గూడ జైలులో ఉన్నాడు.
హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): ఎలెట్స్ టెక్నో మీడియా సంస్థ, హైదరాబాద్ మెట్రో రైల్ భాగస్వామ్యంతో మంగళవారం హెచ్ఐసీసీ నోవోటెల్లో 2వ నేషనల్ మొబిలిటీ సమ్మిట్- 2026ను నిర్వహించనున్నామని రవాణాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ‘యాక్సిలరేటింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ మొబిలిటీ’ అనే థీమ్‌తో ఈ సమ్మిట్‌ను నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నది. దేశంలో స్థిరమైన, సమగ్ర మొబిలిటీ భవిష్యత్తుపై రవాణా అధికారులు, పరిశ్రమ ప్రతినిధులు, స్టార్టప్, సాంకేతిక సంస్థల ప్రతినిధులు దీనిపై చర్చించనున్నట్టు తెలిపింది. ఈ కార్యక్రమానికి రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎస్ కే రామకృష్ణారావు, రవాణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హాజరుకానున్నారని పేర్కొన్నది.