హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఆదిలాబాద్ తదితర ప్రాంతాల్లో తాగునీటి సదుపాయం ఒక సవాలుగా మారిందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర చెప్పారు. రాజ్యసభలో సోమవారం ఆయన జల్ జీవన్ మిషన్‌కు సంబంధించిన బడ్జెట్‌పై చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్ బదులిస్తూ దేశం మొత్తం మీద జల్ జీవన్ మిషన్ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ సహాయం పొందని రాష్ట్రాలు రెండు ఉన్నాయని తెలిపారు.
వాటిలో ఒకటి బీహార్ కాగా, రెండవది తెలంగాణ అని, ఈ రెండు రాష్ట్రాలు తమ సొంత నిధులతో ముందుకెళ్లాయని చెప్పారు. ఇప్పుడు నిధులు కావాలని కోరుతున్నారని, కానీ ఆ పథకం గడువు ముగిసినందున ఆ రాష్ట్రాలను జల్ జీవన్ మిషన్‌లో చేర్చలేమని పాటి ల్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం 2024లో ఈ పథకాన్ని మొదలుపెట్టిందని, 2028 నాటికి లక్ష్యా న్ని చేరుకోవాలని గడువు విధించినట్టు వెల్లడించారు. తెలంగాణ, బీహార్ రాష్ర్టాలు ఎటువంటి ప్రాజెక్ట్ రిపో ర్ట్లు సమర్పించని కారణంగా ఈ పథకాన్ని మంజూ రు చేయలేదని కేంద్రమంత్రి వివరించారు.