హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 16 (నమస్తే తెలంగాణ )/హిమాయత్‌నగర్ : బంక్ నిర్వాహకులు కృత్రిమ ఇంధన కొరత సృష్టించడంలో భాగంగానే ఎల్పీజీ, సీఎన్జీ బంక్‌ల వద్ద నో స్టాక్ బోర్డులు పెట్టారని ఆటో డ్రైవర్ల యూనియన్ జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆటో యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం నారాయణగూడ చౌరస్తాలో నిరసన చేపట్టారు. బ్యాన్సర్లతో ర్యాలీ తీశారు. అనంతరం ఆటో జేఏసీ నాయకులు సత్తిరెడ్డి, వెంకటేశ్ మాట్లాడుతూ.. బంక్‌ల కృత్రిమ కొరతపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక్కసారిగా రూ.30 నుంచి రూ.40 పెంచడంపై ఆవేదన వ్యక్తంచేశారు. నిరసనలో నిరంజన్, శ్రీనివాస్, రవి తదితరులు పాల్గొన్నారు.
గోదాములో 300 సిలిండర్లు మాయం ; అచ్చంపేట తహసీల్దార్ సైదులు తనిఖీలో వెలుగులోకి ఘటన
అచ్చంపేట రూరల్, మార్చి 16 : గోదాములో ఉండాల్సిన 300 నిండు గ్యాస్ సిలిండర్లు మాయమైన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. గ్యాస్ ట్రబుల్ ఉన్న సమయంలో ఇన్ని సిలిండర్లను నిర్వాహకులు పక్కదారి పట్టించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అచ్చంపేట పట్టణంలోని లక్ష్మీప్రసన్న భారత్ గ్యాస్ ఏజెన్సీ గోదామును సోమవారం తహసీల్దార్ సైదులు తనిఖీ చేశారు. గోదాంలో ఉండాల్సిన 300 నిండు సిలిండర్ల అక్కడ లేవు. గ్యాస్ ఏజెన్సీ కార్యాలయ రిజిస్టర్లో లెక్కలో తేడాను గుర్తించారు. నిర్వాహకులు ఉద్దేశపూర్వకంగా బయటి మార్కెట్‌కు తరలించి కృత్రిమ కొరత సృష్టించి ఎక్కువ ధరకు విక్రయించేందుకు రంగం సిద్ధం చేశారని తహసీల్దార్ వెల్లడించారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.