Mohan Bhagwat : ప్రపంచ దేశాల నడుమ జరుగుతున్న పలు యుద్ధాల గురించి ఆరెస్సెస్ చీఫ్ (RSS chief) మోహన్ భగవత్ (Mohan Bhagavat) ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్ర (Maharastra) లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం సంఘర్షణలతో నిండిన ఈ ప్రపంచానికి హిందూయిజం (Hinduism) అవసరం చాలా ఉందని అభిప్రాయపడ్డారు.
అన్ని రకాల వైవిధ్యాలను ఎలా అంగీకరించాలి..? ఎలా పాటించాలనే విషయాన్ని హిందూయిజం మాత్రమే ప్రపంచ దేశాలకు నేర్పుతుందని మోహన్ భగవత్ అన్నారు. సంఘర్షణలను ఎలా నియంత్రించాలో ప్రపంచ దేశాలకు తెలియకపోవడంవల్లే రోజుల తరబడి ఘర్షణలు తీవ్ర రూపం దాలుస్తున్నాయని చెప్పారు. ధర్మాన్ని బోధించే హిందూయిజాన్ని పాటించడం మాత్రమే అన్ని సమస్యలకు పరిష్కారమని పేర్కొన్నారు.
భిన్నత్వంలో ఏకత్వాన్ని పాటించగలిగే జీవన విధానాన్ని హిందూ సంస్కృతీ సంప్రదాయాలు అలవాటు చేస్తాయని మోహన్ భగవత్ తెలిపారు. హిందూయిజం అనేది ఒక మతం కాదని, ఓ సార్వత్రిక విశ్వాసం, మానవత్వం, ప్రకృతితో మమేకమైన జీవన విధానమని అన్నారు. ప్రజలు దేవుడికి ఎలా సేవచేస్తారో, సమాజానికీ అదే విధంగా సేవ చేయాలని హిందూమతం బోధిస్తుందని తెలిపారు.
భారత ప్రజలు నమ్మే ధర్మం కోసం పూర్వీకులు అనేక త్యాగాలు చేసినట్లు దేశ చరిత్ర ప్రపంచానికి తెలియజేస్తోందని, ప్రాణాలు పోతున్నా శివాజీ లాంటి మహాత్ములు ధర్మాన్ని తప్పలేదని ఈ సందర్భంగా గుర్తుచేశారు.