Harsh Goenka : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence-AI) ఇప్పుడు ప్రైవేటు రంగాల్లోని ఉద్యోగుల్లో భయం రేపుతోంది. అందుకే ఎక్కడ చూసినా ఏఐ గురించే చర్చ జరుగుతోంది. ఏఐ రాకతో ఉద్యోగాలు పోతాయని కొందరు నిపుణులు అంటుండగా, ఉద్యోగాలకు ఎలాంటి ముప్పు ఉండదని మరికొందరు చెబుతున్నారు. అయితే మెజారిటీ ఉద్యోగుల్లో మాత్రం ఏఐపై భయాందోళనలు ఉన్నాయి. ఇవి ఉద్యోగుల స్థానాన్ని భర్తీ చేయగలవనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గొయెంకా (Harsh Goenka) తాజాగా ఈ చర్చలో చేరారు.
ఏఐ రాకతో ఉద్యోగాలు పోతాయా..? అనే ప్రశ్నకు వివరణ ఇస్తూ హర్ష్ గొయెంకా తన ఎక్స్ ఖాతాలో ఆసక్తికర పోస్టు పెట్టారు. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల ఉద్యోగాలను కోల్పోవడం గురించే అందరూ ఆందోళన చెందుతున్నారని, కానీ అదేమీ జరగదని, అయితే ఏఐ ప్రస్తుతం జరుగుతున్న పనిని మార్చేసి అందులో నూతనత్వం తీసుకొస్తుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ప్రాంప్ట్ ఇంజినీర్లు, ఏఐ ప్రోడక్ట్ మేనేజర్లు, ఏఐ ఎథిక్స్ ఎక్స్పర్ట్స్ లాంటి కొత్త ఉద్యోగాలు పుట్టే అవకాశం ఉందన్నారు.
కార్యాలయాలు కూడా ఇప్పటిలా ఉండకపోవచ్చని, వాటి రూపురేఖలు మారే అవకాశం ఉందని హర్ష్ గొయెంకా అంచనా వేశారు. స్మార్ట్ వర్క్ చేసేవారు వీటిలో బాగా రాణిస్తారని అభిప్రాయం వ్యక్తంచేశారు. గొయెంకా పోస్టు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేశారు. గొయెంకా చెప్పినట్లుగా ఏఐ ఉద్యోగాల తొలగింపునకు కాకుండా.. నూతన ఉద్యోగ మార్కెట్కు తెర తీస్తోందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
‘కాప్ జెమిని’ లాంటి కంపెనీలు ఫ్రెషర్లను నియమించుకుంటున్నాయని మరో నెటిజన్ స్పందించాడు. ఏఐ ప్రతి రంగంలో ఉత్పాదకతను పెంచుతుందని, పెట్టుబడిపై రాబడిని మెరుగుపరుస్తుందని, దాంతో ఆర్థికవృద్ధి సైతం పెరుగుతుందని పేర్కొన్నాడు. కంటెంట్ క్రియేషన్, కోడింగ్, డిజైనింగ్ రంగాల్లో ఏఐ ప్రభావం వల్ల ఉద్యోగాలపై కొంతమేర ప్రభావం పడుతుందని మరో నెటిజన్ అభిప్రాయపడ్డాడు.