Gold rates | న్యూఢిల్లీ, ఆగస్టు 5 : దేశీయంగా బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. మంగళవారం హైదరాబాద్‌లో 99.9 స్వచ్ఛత కలిగిన 24 క్యారెట్ 10 గ్రాముల రేటు రూ.820 పుంజుకొని రూ.1,02,220 వద్ద నిలిచింది. 99.5 స్వచ్ఛత కలిగిన 22 క్యారెట్ తులం విలువ రూ.750 ఎగిసి రూ.93,700 దగ్గర స్థిరపడింది. దీంతో గత నెల 23న నమోదైన ఆల్‌టైమ్ హై రికార్డు స్థాయి దరిదాపుల్లోకి మళ్లీ గోల్డ్ ప్రైస్ వచ్చినైట్టెంది. మునుపెన్నడూ లేనివిధంగా నాడు 24 క్యారెట్ తులం రూ.1,02,330 పలికింది. 22 క్యారెట్ రూ.93,800గా ఉన్నది. ఇదిలావుంటే ఢిల్లీలో 24 క్యారెట్ రేటు రూ.800 ఎగబాకి రూ.98,820గా ఉన్నట్టు అఖిల భారత సరఫా అసోసియేషన్ తెలిపింది.
మార్కెట్లో బంగారంతోపాటు వెండికీ ఆదరణ కనిపిస్తున్నది. ఈ క్రమంలోనే ఈ ఒక్కరోజే రూ.2,000 పెరిగి కిలో ధర ఢిల్లీలో రూ.1,12,000ను తాకింది. సాధారణ వినియోగదారులతోపాటు పారిశ్రామిక వర్గాల నుంచీ డిమాండ్ ఉందని, అందుకే నిన్నమొన్నటిదాకా తగ్గుతూపోయిన రేట్లు.. తిరిగి విజృంభిస్తున్నాయని మార్కెట్ విశ్లేషకులు చెప్తున్నారు. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ ప్రకంపనల నడుమ దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. ఫలితంగా ఇన్వెస్టర్లు సైతం తమ పెట్టుబడుల రక్షణార్థం.. గోల్డ్, సిల్వర్ వైపు చూస్తున్నారని నిపుణులు తాజా ట్రెండ్‌ను విశ్లేషిస్తున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో పుత్తడి ధర కొంతవరకు తగ్గుముఖం పట్టింది. న్యూయార్క్ స్పాట్ మార్కెట్లో 20.95 డాలర్లు లేదా 0.62 శాతం పడిపోయి ఔన్స్ రేటు 3,352.61 డాలర్లకు పరిమితమైంది. అయితే వెండి ధర మాత్రం స్థిరంగా 37.39 డాలర్ల వద్దే ఉన్నది. కాగా, ట్రంప్ సుంకాల బెదిరింపులు ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువను రికార్డు స్థాయి కనిష్ఠాల్లోకి దిగజార్చుతున్నదని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇది ఇలాగే సాగితే గోల్డ్, సిల్వర్ రేట్లు ఇంకా పెరిగే వీలుందని చెప్తున్నారు. అలాగే అమెరికా ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్ల నిర్ణయం కూడా మార్కెట్‌ను ప్రభావితం చేస్తుందని అంటున్నారు.
బంగారం ధరలు పడుతూలేస్తూ ఉండటంతో రిటైల్ మార్కెట్లో అమ్మకాలు అంతంతమాత్రంగానే ఉన్నాయని వ్యాపారులు తెలియజేస్తున్నారు. శ్రావణ మాసం వచ్చినా శుభకార్యాలకు తప్పక అవసరమైతేనే కొంటున్నారని జ్యుయెల్లర్స్ వాపోతున్నారు. ధరలు ఇంకా పెరిగితే రాబోయే పండుగ సీజన్లో విక్రయాలు ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చన్న ఆందోళన వారిలో కనిపిస్తున్నది. ఇప్పటికే కస్టమర్లను ఆకట్టుకొనేందుకు రకరకాల ఆఫర్లను పెడుతున్నామని, అయినా స్పందన అరకొరగానే ఉంటుందని మెజారిటీ దుకాణదారులు చెప్తుండటం మార్కెట్లో నెలకొన్న స్తబ్ధతకు అద్దం పడుతున్నది.