హోబర్ట్ : ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్‌లో భారత హాకీ జట్టు వరుస ఓటముల ప్రస్థానం కొనసాగుతున్నది. ఆదివారం ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన పోరులో ఆస్ట్రేలియా 5-4తో(పెనాల్టీ షూటౌట్) భారత్‌పై ఉత్కంఠ విజయం సాధించింది. నిర్ణీత సమయంలో ఇరు జట్ల స్కోర్లు 2-2తో సమయ్యాయి. గత మ్యాచ్‌లతో పోల్చుకుంటే ఆసీస్‌తో పోరులో టీమ్ఇండియా మెరుగైన పోరాట పటిమ కనబరిచింది.
భారత్ తరఫున అమిత్ రోహిదాస్(15ని), జుగ్రాజ్సింగ్(43ని) చెరో గోల్ చేయగా, జోయల్ రింటాల(47ని, 56ని) ఆసీస్‌కు డబుల్ గోల్స్ అందించాడు. అయితే విజేతను నిర్ణయించేందుకు అనివార్యమైన పెనాల్టీ షూటౌట్లో భారత్‌పై ఆసీస్‌దే పైచేయి అయ్యింది. ఈ మ్యాచ్‌కు ముందు ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్‌లో టీమ్ఇండియా వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది.