హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ) : ఒకవైపు గోదావరి, కృష్ణా నదుల్లో వేలాది క్యూసెకుల నీరు పరవళ్లు తొకుతూ సముద్రం పాలవుతున్నాయి. వాటిని ఒడిసిపట్టాల్సిన పాలకులు ఆకాశం దిక్కు చూస్తూ హోమాలు జరిపిస్తూ వానలు కురిపించాలని దేవున్ని వేడుకుంటున్నారు. ఎగువనుంచి దుంకుతూ వస్తున్న జలాలను ఎత్తిపోసేందుకు కావాల్సినంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్నది. ప్రాజెక్టులు, పంపులు, మోటర్లు సిద్ధం గా ఉన్నాయి. నీళ్లను పొలాలకు తరలించేందుకు కాలువలూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో కావాల్సింది యాగం కాదు.. స్విచ్‌లు నొక్కి మోటర్లు పరుగులు పెట్టించే సంకల్పం. కాంగ్రెస్ ప్రభుత్వానికి అదే లోపించింది. ఓవైపు సూపర్ ఎల్ నినో భయపడుతుంటే.. మరోవైపు ఈ సీజన్లో ఇప్పటికే ఒక్క ప్రాణహిత నుంచే 300 టీఎంసీలకుపైగా జలాలు వృథాగా సముద్రం పాలయ్యాయని గణాంకాలు చెప్తున్నాయి. కండ్లముందే అపార జలరాశి ప్రవహిస్తున్నా, వాటిని ఒడిసిపట్టి మళ్లించాలని ప్రతిపక్షాలు, రైతులు నెత్తినోరు మొత్తుకొని చెప్తున్నా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పెడచెవిన పెడుతున్నది. ఇన్నాళ్లూ తన బాధ్యతను విస్మరించి, ఇప్పుడు నాగార్జునసాగర్ తీరాన మహా వరుణయాగం పేరుతో కొత్త నాటకం మొదలుపెట్టిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కృష్ణాలో యాగం.. గోదావరికి విరామం
రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురువాలని, ప్రాజెక్టులు జలకళతో నిండాలని, రైతాంగం సుభిక్షంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం నాగార్జునసాగర్‌లో సోమవారం ‘మహా వరుణయాగం’ నిర్వహించింది. ప్రభుత్వం తరఫున నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ దంపతులు ఆదిపూజతో యాగ క్రతువును ప్రారంభించగా, సీఎం రేవంత్ సతీసమేతంగా పాల్గొన్నారు. 108 మంది వేదపండితులు, 11 హోమగుండాలు, పట్టువస్త్రాల సమర్పణ, ప్రత్యేక పూజ లు.. ఇలా కృష్ణానదీ తీరాన ఘనంగా యాగం జరిగింది. ఎల్ నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు దైవబలం కోసం జరిపే ఇలాంటి యాగాలను ఎవరూ తప్పుబట్టరు. కానీ, ప్రభు త్వం తన అసలు బాధ్యతను విస్మరించిందని సాగునీటిరంగ నిపుణులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుతం ఎగువ ప్రాంతా ల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరిలో వరద ప్రవాహం రోజురోజుకూ పెరుగుతున్నది. మిడ్‌మానేరు జలాశయంలో ప్రస్తుతం సుమారు 22 టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నదని, ఈ నీటిని కాళేశ్వరం వ్యవస్థలోని మోటర్ల ద్వారా ఎత్తిపోస్తే తెలంగాణలోని 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని వారు చెప్తున్నారు. ఎల్ నినో నేపథ్యంలో వర్షాభావ పరిస్థితులు ఉంటాయని అంచనా వేయగా, గోదావరి బేసిన్ మాత్రం ఆదుకున్నది. ఈ సీజన్లో ప్రాణహిత నుంచే ఇప్పటివరకు 300 టీఎంసీల గోదావరి జలాలు ఆంధ్రప్రదేశ్‌కు పారి, చివరకు సముద్రంలో కలిశాయి. కృష్ణా నదిలో కూడా ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు లక్షలాది క్యూసెకుల వరదనీటి ప్రవాహం నమోదవుతున్నది.
నీటిని ఎత్తిపోసే సోయి లేక..
సాధారణంగా ప్రాణహితలో 50వేల క్యూసెక్కుల ప్రవాహం దాటితేనే కన్నెపల్లి పంప్‌హౌస్‌కు వరద వచ్చి చేరుతుంది. అంటే ప్రాణహితలో వరద ఎక్కువ వచ్చిన ప్రతి సందర్భంలోనూ మేడిగడ్డ బరాజ్‌లో నీటిని నిల్వ చేయకుండానే కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి ఎత్తిపోతలు చేపట్టే అవకాశమున్నది. అన్నారం, సుందిళ్ల రిజర్వాయర్ల పూర్తి నిల్వ సామర్థ్యం 20 టీఎంసీలు. అక్కడ పూర్తిస్థాయిలో నీటిని నింపకుండానే, కేవలం ఎల్లంపల్లికి ఎత్తిపోసుకునే విధంగా మినిమమ్ డ్రా డౌన్ లెవల్ (ఎండీడీఎల్) వరకు మెయింటెన్ చేస్తూ కూడా ఎత్తిపోతలు చేపట్టవచ్చు. కాళేశ్వరంలో భాగంగా 150 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రిజర్వాయర్లు నిర్మించారని, వాటిని నింపుకోవచ్చని ప్రతిపక్షాలు చెప్తున్నాయి. ప్రభుత్వానికి ఈ మాత్రం స్పృహ లేకుండా, నీటిని ఎత్తిపోయాల్సింది పోయి యాగాలు చేస్తూ ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నదని మండిపడుతున్నారు.