హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ స్థానిక సంస్థల్లో ట్రాన్స్జెండర్లకు కో-ఆప్షన్ సభ్యులుగా అవకాశం కల్పించేందుకు ఉద్దేశించిన నూతన బిల్లును గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ), మలాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ), సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(సీఎంసీ) సహా రాష్ట్రంలోని అన్ని నగర కార్పొరేషన్లకు వర్తింపజేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ డిమాండ్చేశారు.
శాసనమండలి చైర్మన్ ద్వారా శుక్రవారం ఆయన ప్రభుత్వం దృష్టికి పలు కీలక అంశాలను తీసుకెళ్లారు. రాజధాని నగర కార్పొరేషన్లకు బిల్లు వర్తింపు తప్పనిసరి చేయాలన్నారు. వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల తరహాలో తెలంగాణలోనూ ట్రాన్స్జెండర్ల కోసం ఒక ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని సూచించారు. సమాజంలో, పాలనా వ్యవస్థలో సరైన మద్దతు, ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్లే ట్రాన్స్జెండర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
కేవలం కో-ఆప్షన్ పదవులకే పరిమితం కాకుండా, ప్రభుత్వం వారికి ప్రత్యేక పింఛన్లు, స్వయం ఉపాధి రుణాలు, నైపుణ్యాభివృద్ధి (సిల్ బిల్డింగ్) కార్యక్రమాల్లో ప్రత్యేక కోటాను కల్పించి పూర్తిస్థాయి సామాజిక, ఆర్థిక, సాంసృతిక సాధికారత అందించాలని కోరారు. 2018 నాటి కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో రూపకల్పన సమయంలోనే ట్రాన్స్జెండర్ల సంక్షేమం కోసం ప్రత్యేక అధ్యాయాన్ని తానే స్వయంగా రూపొందించిన విషయాన్ని దాసోజు శ్రవణ్ ఈ సందర్భంగా గుర్తుచేశారు.