పల్లెకిలె : టీ20 ప్రపంచకప్ ప్రస్థానంలో శ్రీలంకపై ఇంగ్లండ్ సంపూర్ణ ఆధిపత్యం కొనసాగుతున్నది. మెగాటోర్నీలో తమ విజయాల రికార్డును 6-1కి పెంచుకుంటూ ఇంగ్లండ్ టీమ్ సెమీస్ దిశగా అడుగులు వేస్తున్నది. ఆదివారం సూపర్-8 తొలి పోరులో ఇంగ్లండ్ 51 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 147 పరుగుల లక్ష్యఛేదనలో లంక 16.4 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూలింది. విల్‌జాక్స్(3/22), రషీద్(2/13), ఆర్చర్(2/20) ధాటికి లంక బ్యాటర్లు ఘోరంగా కుదేలయ్యారు. పిచ్ పరిస్థితులను తమ అనుకూలంగా మలుచుకుంటూ ఇంగ్లండ్ బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టారు. స్వల్ప ఛేదనలో లంక బ్యాటర్ల ఘోరంగా తడబడ్డారు. సూపర్ ఫామ్‌మీదున్న ఫతుమ్ నిస్సనక(9)ను ఔట్ చేసి ఆర్చర్ ఆదిలోనే లంకను కోలుకోలేని దెబ్బకొట్టాడు. ఇదే దూకుడులో జాక్స్‌ను ప్రవేశపెట్టిన కెప్టెన్ బ్రూక్ మెరుగైన ఫలితం రాబట్టాడు.
ఒకే ఓవర్లో పవన్ రత్ననాయకె(0), కమిల్ మిశారె(6)ను ఔట్ చేసి జాక్స్..ఇంగ్లండ్‌కు డబుల్ ధమాకా అందించాడు. దీంతో పవర్‌ప్లే ముగిసే సరికి లంక 34 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. దశున్ శనక(30) కెప్టెన్ ఇన్నింగ్స్ జట్టును గెలుపు తీరాలకు చేర్చలేకపోయింది. వచ్చిన బ్యాటర్ వచ్చినట్లు ఔట్ కావడంతో శనక ఒంటరిపోరాటం లంక లాభం చేకూర్చలేదు. అంతకుముందు ఓపెనర్ ఫిల్ సాల్ట్(40 బంతుల్లో 62, 6ఫోర్లు, 2సిక్స్‌లు) అర్ధసెంచరీతో ఇంగ్లండ్ 20 ఓవర్లలో 146/9 స్కోరు చేసింది. ఫామ్‌లేమితో సతమతమవుతున్న సాల్ట్ ఈ మ్యాచ్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిచాడు. దునిత్ వెల్లలాగె(3/26), తీక్షణ(2/21), మదుశనక(2/25) ధాటికి ఇంగ్లండ్ మిడిలార్డర్ ఘోరంగా తడబడింది. బట్లర్(7), బెతెల్(3), బాంటన్(6), బ్రూక్(14), కరన్(11) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. జాక్స్(21) ఒక్కడే అంతోఇంతో బ్యాటు ఝులిపించాడు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టును గెలిపించిన జాక్స్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.