బోధన్, ఆగస్టు 12: బోధన్ నియోజకవర్గంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) విజయవంతంగా పూర్తిచేయడంలో బీఆర్ఎస్ శ్రేణుల కృషి అభినందనీయమని జడ్పీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు బోధన్ నియోజకవర్గ ఇన్చార్జి దాదన్నగారి విఠల్‌రావు అన్నారు. ‘సర్’లో అర్హులైన ఓటర్లను చేర్చడంలో, గ్రామస్థాయి నుంచి నియోజకవర్గంస్థాయి వరకు బీఆర్ఎస్ నాయకులు కృషిచేశారని పేర్కొన్నారు. ‘సర్’ ప్రక్రియ ముగిసిన సందర్భంగా బుధవారం ఆయన పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే షకీల్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘సర్’ ప్రక్రియ విజయవంతం కోసం కృషిచేసిన నియోజవర్గంలోని బూత్‌స్థాయి, మండలస్థాయి నాయకులు, మండల సమన్వయ కమిటీ సభ్యులు, బీఆర్ఎస్ నాయకురాలు ఆయేషా ఫాతిమా, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. బోధన్ నియోజకవర్గంలోని 246 పోలింగ్ కేంద్రాల్లో మొత్తం 2,23,152 మంది ఓటర్లు ఉండగా, ప్రత్యేక సమగ్ర సవరణలో 1,95,344 మంది ఓటర్ల వివరాలను నమోదుచేశారని తెలిపారు. ‘సర్’లో నమోదుకాని 27,808 మందిని మరణించిన, ఇతర ప్రాంతాలకు వలస, అర్హత లేని ఓటర్లను గుర్తించారని పేర్కొన్నారు. బోధన్‌లో తనకు ‘సర్’ కార్యక్రమం బాధ్యతలను పార్టీ నాయకత్వం అప్పగించిందని, విజయవంతంగా నిర్వహించానని చెప్పారు. బోధన్ నియోజకర్గం ‘సర్’కు సంబంధించిన నివేదికను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో అప్పగించినట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ మండలా అధ్యక్షులు నర్సింగ్‌రావు, డి.శ్రీరామ్, నాయకులు పోశెట్టి, హసన్ తదితరులు పాల్గొన్నారు.