హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర విభజన సవ్యంగా చేయలేదని, తెలంగాణకు లాభం కలిగిలా చేశారని, ఇరిగేషన్లో రెండు రాష్ర్టాలు అభివృద్ధి చెందినా విభజనప్పుడు తమకు చారిత్రక అన్యాయం చేశారని ఏపీ సర్కార్ మరోసారి అక్కసు వెళ్లగక్కింది. కృష్ణా జలాలను ఏపీ, తెలంగాణ మధ్య ప్రస్తుతమున్న 66:34 నిష్పత్తిలోనే పంచాలని, బేసిన్ పారామీటర్స్ ప్రకారం పునఃపంపిణీ చేపట్టవద్దని డిమాండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సెక్షన్ 3 మార్గదర్శకాల మేరకు ఇరు రాష్ర్టాల మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీకి సంబంధించి బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ చేపట్టిన విచారణ ఢిల్లీలో బుధవారం ప్రారంభమైంది. ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ బ్రిజేశ్‌కుమార్, సభ్యులు జస్టిస్ రామ్మోహన్‌రెడ్డి, జస్టిస్ ఎస్ తలపాత్ర ఎదుట ఏపీ తన వాదనలను కొనసాగించింది. గతంలో చేసిన ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీల కేటాయింపులకు రక్షణనివ్వాలని కోరింది. గత కేటాయింపులను పునఃపంపిణీ చేయడానికి వీల్లేదని, అది పార్లమెంట్ ద్వారానే మార్చడానికి వీలవుతుందని తెలిపింది. ఏపీ సమర్పించిన ఎవిడెన్స్ సరిగ్గా లేవని, సరైన ఆధారాలు ఇవ్వాలంటూ ట్రిబ్యునల్ ఈ సందర్భంగా ఏపీకి సూచించింది.