ముంబై: రసాయనాలతో పండించిన 1,400 కిలోల అరటిపండ్లను ఆహార భద్రత అధికారులు తనిఖీలో గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు. పలు ఆహార విక్రయ కేంద్రాలపై చర్యలు చేపట్టారు. కొన్నింటి లైసెన్సులు, మరికొన్ని ఈటరీల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను నిలిపివేశారు. (chemically ripened bananas) మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. ఆహార, ఔషధ పరిపాలన సంస్థ (ఎఫ్‌డీఏ) అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. ముంబైలోని ఒక పండ్ల దుకాణంలో పనిచేసే కార్మికుడు, ప్రమాదకర రసాయనమైన ‘ఎథెఫాన్’లో అరటిపండ్లు ముంచి వాటిని కృతిమంగా పండించడాన్ని గుర్తించారు. రూ.67,814 విలువైన 1,394 కిలోల అరటిపండ్లను స్వాధీనం చేసుకున్నారు. ఏపీఎంసీ పోలీస్ స్టేషన్లో దీనిపై కేసు నమోదు చేశారు.
కాగా, ముంబైలోని పలు ఆహార కేంద్రాలను ఎఫ్‌డీఏ అధికారులు తనిఖీ చేశారు. ఆహార భద్రత, పరిశుభ్రత, నిల్వ, డాక్యుమెంటేషన్‌కు సంబంధించిన లోపాలకు సంబంధించి 11 ఈటరీలపై చర్యలు చేపట్టారు. ఎనిమిది ఆహారశాలల లైసెన్సులు, మరో మూడింటి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను నిలిపివేశారు.
మరోవైపు ముంబైలోని మూడు సంస్థల నుంచి రూ. 31.14 లక్షల విలువైన నిషేధిత ఆహార ఉత్పత్తులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్ట్ చేయడంతో పాటు వారిపై కేసులు నమోదు చేశారు. పాల్ఘడ్లో జరిగిన రెండు ఆపరేషన్లలో నిషేధిత పాన్ మసాలా, గుట్కా, సుగంధ పొగాకు వంటివి ఎఫ్‌డీఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అలాగే పూణే డివిజన్లోని సోలాపూర్ జిల్లా మల్షిరాస్‌లో డిటర్జెంట్‌తో తయారు చేసిన కల్తీ పాలను అధికారులు గుర్తించారు. సుమారు రూ. 6.69 లక్షల విలువైన 16,730 లీటర్ల కల్తీ పాలను ధ్వంసం చేశారు. నిందితులపై కేసులు నమోదు చేశారు.