ఖిలావరంగల్ : శివనగర్ స్మశాన వాటికలో విద్యుత్ లైట్లు వెలగకపోవడం వల్ల మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళల్లో అంత్యక్రియలు నిర్వహించాల్సిన పరిస్థితుల్లో సరియైన వెలుతురు లేకపోవడంతో చీకటిలోనే కర్మకాండలు చేయాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్మశాన వాటికలో ఉన్న విద్యుత్ స్తంభాలకు కరెంటు తీగలు తెగిపోవడం వల్ల శివనగర్ స్మశాన వాటికను పూర్తిగా అంధకారం ఆవహించింది. దీంతో చీకటిలోనే అంత్యేష్టి నిర్వహించడం పెద్ద సవాలుగా మారుతోందని మృతుల కుటుంబాలు, బంధువులు ఆరోపిస్తున్నారు.
చివరకు మృతుడి బంధువులు మొబైల్ ఫోన్ ఫ్లాష్ లైట్ల సహాయంతో అంత్యక్రియలు పూర్తి చేయాల్సిన దౌర్భాగ్యపు పరిస్థితి శివనగర్ స్మశాన వాటికలో నెలకొందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి స్మశాన వాటికలో లైట్లు వెలగడం లేదని స్థానికులు చెబుతున్నారు. స్థానికులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన పట్టించుకోవడంలేదని మండిపడుతున్నారు. చివరి మజిలీ నిర్వహించే పవిత్ర స్థలంలో కనీసం సౌకర్యాలు కల్పించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్టగా శివనగర్ స్మశాన వాటిక వేదికగా మారిందని స్థానికులు ఆరోపించారు. స్మశాన వాటికలో విద్యుత్ లైట్లు ఏర్పాటు చేసి మౌలిక వసతులు కల్పించుకుంటే బల్దియా కార్యాలయం ఎదుట నిరసన చేపడుతామని స్థానికులు హెచ్చరిస్తున్నారు.