Crime news : ఎనిమిదేళ్ల క్రితం కన్న తండ్రిని కాల్చి చంపి జైలుకు వెళ్లాడు. ఇటీవల పెరోల్ (Perol) పై బయటికి వచ్చాడు. దాంతో అప్పటికే తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్న తన తమ్ముడి చేతిలో హత్యకు గురయ్యాడు. మధ్యప్రదేశ్ (Madhyapradesh) రాష్ట్రంలోని శివపురి (Shivapuri) లో ఈ ఘటన చోటుచేసుకుంది. అన్న హత్యకు తమ్ముడు ప్లాన్ చేసిన తీరు సినిమాను తలపిస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో 2017 ఏప్రిల్‌లో హనుమాన్ సింగ్ తోమర్ అనే రిటైర్డ్ పోలీస్ అధికారిని అతని కొడుకు అజయ్ తోమర్ కాల్చిచంపాడు. ఆస్తులు విషయంలో గొడవ పెట్టుకుని తండ్రిని హత్యచేశాడు. అదేసమయంలో తమ్ముడు భాను తోమర్‌ను కూడా కాల్చిచంపేందుకు విజయ్ ప్రయత్నించగా తృటిలో తప్పించుకున్నాడు.
ఆ తర్వాత తండ్రి హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష పడటంతో 2017 మేలో అజయ్ జైలుకు వెళ్లాడు. అప్పుడు అతడి వయసు 32 ఏళ్లు. ఇప్పుడు 40 ఏళ్లు. ఇటీవల పెరోల్‌పై అజయ్ బయటికి వచ్చాడు. ఇది తెలుసుకున్న అతడి సోదరుడు భాను హత్యకు ప్లాన్ చేశాడు. రూ.లక్షకు కిరాయి హంతకులను మాట్లాడాడు.
వాళ్లు సూచించిన స్పాట్‌కు అజయ్‌ని చేర్చేలా ఓ 17 ఏళ్ల అమ్మాయిని ఎరవేశాడు. ఆ అమ్మాయి కేవలం 9 రోజుల్లో అజయ్‌తో పరిచయం పెంచుకుంది. ఆమెను పూర్తిగా నమ్మిన తర్వాత ఎంజాయ్ చేయడానికి గ్వాలియర్ వెళ్దామని ప్రతిపాదించింది. దాంతో అజయ్ అంగీకరించాడు. జూలై 23న అజయ్ కారులో ఇద్దరూ గ్వాలియర్‌కు బయలుదేరారు.
మార్గమధ్యలో కారు కిరాయి హంతకులు ముందే సూచించిన ప్రదేశంలోకి వెళ్లగానే వాష్‌రూమ్ సాకుతో యువతి కారును ఆపించింది. కారు దిగి హంతకులకు సిగ్నల్ ఇచ్చింది. అంతే కొన్ని సెకన్లలో కారును సమీపించిన హంతకులు అజయ్‌ని కాల్చిచంపేశారు. ఆ తర్వాత భాను ఏమీ తెలియనట్లుగా తన అన్న అంత్యక్రియల్లో పాల్గొన్నాడు.
పోలీసుల దర్యాప్తులో అతడే హత్యకు సూత్రధారిగా దొరికిపోయాడు. అతడితోపాటు యువతిని, కిరాయి హంతకులను పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపించారు.