హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ‘బుల్డోజర్ రాజ్’ నడుస్తున్నదని కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలోని భూదాన్ భూముల్లో నివసిస్తున్న పేదలకు చెం దిన సుమారు 700 ఇండ్లను నేలమట్టం చేసి, మూడు వేల మందిని కాంగ్రెస్ ప్రభుత్వం నిరాశ్రయులను చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఏదో వెలగబెట్టినట్టు కేరళలో ప్రకటనలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదలచేశారు. పేదలకు తోడుంటామని, తెలంగాణలో తమ పాలన అద్భుతంగా సాగుతున్నదంటూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కేరళ రాష్ట్రంలో ప్రకటనలు ఇవ్వడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.
పత్రికల్లో ప్రకటనలకు, తెలంగాణలో వాస్తవ పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పొట్టకొడుతున్నదని ధ్వజమెత్తారు. ఉత్తర భారతంలో బీజేపీ అవలంబిస్తున్న ‘బుల్డోజర్ రాజ్’ను కాంగ్రెస్ నక లు కొడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలో కర్ణాటకలో బుల్డోజర్ రాజ్ నడిచిందని, ఇప్పుడు తెలంగాణలోనూ మొదలైందని విమర్శించారు. కర్ణాటకలోని యెలహంకలోనూ పేదల ఇండ్లు కూల్చివేశారని, వారు ఇప్పటికీ నిరాశ్రయులుగా రోడ్లపైనే తలదాచుకుంటూ బతుకుపోరాటం కొనసాగిస్తున్నారని ఆవేదన చెందారు. ఇప్పుడు ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల్లో దా దాపు 700 ఇండ్లను కాంగ్రెస్ ప్రభుత్వం నేలమట్టం చేసిందని ఆరోపించారు. యథాతథ స్థితిని కొనసాగించాలని కోర్టులు చెప్పినా, పట్టించుకోకుండా వేలాది మందిని రోడ్డున పడేయడంపై విజయన్ తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
భూదాన్ స్ఫూర్తిని నీరుగార్చిన కాంగ్రెస్
పేదలకు వ్యవసాయ భూమి, సొంత ఇల్లు ఉండాలన్న సదుద్దేశంతో ఆచార్య వినోభాబావే ‘భూదాన్’ ఉద్యమాన్ని ప్రారంభించారని విజయన్ గుర్తుచేశారు. ఆ ఉద్యమ స్ఫూర్తిని కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగార్చిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉన్నా పేదలకు కష్టాలు తప్పడం లేదని మండిపడ్డారు. యెలహంక, ఖమ్మం భూ నిర్వాసితులు ఒకేవిధంగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వెలుగుమట్లలో రాత్రికిరాత్రి పోలీసులను పంపి పేదల ఇండ్లను ఖాళీ చేసి బుల్డోజర్లతో ఇండ్లను నేలమట్టం చేసిన కాంగ్రెస్ సర్కార్, కేరళలో నీతులు చెప్తున్నదని ఎద్దేవా చేశారు. పెద్దఎత్తున ప్రకటనలు ఇస్తూ కేరళ ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు.
కేరళలో గతంలో కొండచరియలు విరిగిపడితే బాధితులకు తమ ప్రభుత్వం ఇండ్లు కట్టించిందని, పునరావాస చర్యలు చేపట్టామని గుర్తుచేశారు. అందరికీ ఇండ్లు కట్టించి పట్టాలు కూడా అందజేశామని తెలిపారు. కానీ, తెలంగాణలో పట్టాదారులను కూడా ఖాళీ చేయిస్తున్నారని, పట్టాలున్నవారిని నకిలీ పట్టాదారులుగా ముద్ర వేసి ఇండ్లను కూలుస్తున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీదని తీవ్ర విమర్శలు చేశారు. వెలుగుమట్లలో కాంగ్రెస్ సర్కార్ చేసిన దమనకాండపై కేరళలోని కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్తారా? అని ప్రశ్నించారు. అమానవీయ పనులు చేయడంలో కాంగ్రెస్ నేతలు సిద్ధహస్తులని ధ్వజమెత్తారు. బీజేపీ, కాంగ్రెస్ ఒకే తాను ముక్కలని పదేపదే నిరూపితం అవుతున్నదని, బలహీనులపై ప్రతాపం చూపించడమే ఆ రెండు పార్టీల అసలు రూపమని దుయ్యబట్టారు.