Cloudburst : క్లౌడ్బస్ట్ (Cloudburst) కారణంగా ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రం ఉత్తరకాశీ (Uttarkasi) జిల్లాలోని ధరాలీ (Dharali) గ్రామాన్ని ముంచెత్తిన జలప్రళయం మృతుల సంఖ్య 5కు పెరిగింది. ఈ దుర్ఘటనలో మంగళవారమే నాలుగు మృతదేహాలు లభ్యం కాగా బుధవారం నాటి సహాయక చర్యల్లో మరో వ్యక్తి మృతదేహం దొరికింది. దాంతో మొత్తం మృతుల సంఖ్య 5కు పెరిగింది.
ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ధరాలీ గ్రామం పూర్తిగా కొండలు, గుట్టల నడుమ ఉండటంతో ఆ కొండలు, గుట్టలపై ఇండియన్ ఆర్మీ, విపత్తు నిర్వహణ బలగాలు గాలిస్తున్నాయి. అక్కడక్కడ చిక్కుకున్న మొత్తం 150 మందిని కాపాడాయి. ఆచూకీ లేని మరికొందరి కోసం ఇంకా సెర్చింగ్ కొనసాగుతోంది.
మంగళవారం క్లౌడ్బస్ట్ కారణంగా ఖీర్ గంగా నది ఉప్పొంగింది. దాంతో నది పక్కనే ఉన్న ధరాలీ గ్రామాన్ని వరద ముంచెత్తింది. అకస్మాత్తుగా వచ్చిన వరదతో ఆ గ్రామంలో ఇళ్లకుఇళ్లే కొట్టుకుపోయాయి. పలు ఇళ్లను బురద కప్పేసింది. భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఊహించని జలప్రళయంతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఆర్మీ, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి.