(స్పెషల్ టాస్క్ బ్యూరో) న్యూఢిల్లీ/హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ) : ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన దాడులతో అగ్నిగుండంగా మారిన పశ్చిమాసియాలో మూడోరోజూ ఉద్రిక్తతలు కొనసాగాయి. తమ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీని హతమార్చిన ఇజ్రాయెల్, అమెరికాపై ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇరాన్ దాడులను తీవ్రతరం చేసింది. ఇజ్రాయెల్‌తో పాటు బహ్రెయిన్, దుబాయ్, దోహా, అబుదాబి, ఖతార్‌లోని పలు ప్రాంతాలపై సోమవారం కూడా దాడులు చేపట్టింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు లక్ష్యంగా ఆయన కార్యాలయంతో పాటు ఆ దేశ ఎయిర్‌ఫోర్స్ కమాండర్ హెడ్‌క్వార్టర్స్‌పై కూడా క్షిపణుల వర్షం కురిపించింది. ఈ మేరకు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ ఒక ప్రకటనలో తెలిపింది. నెతన్యాహు కార్యాలయంపై జరిగిన దాడిలో ఇరాన్ ఖైబర్ క్షిపణులను వాడినట్టు అంతర్జాతీయ మీడియా పేర్కొన్నది.
అయితే, ఈ దాడులు జరిగిన సమయంలో నెతన్యాహు కార్యాలయంలో ఉన్నారా? లేదా? అనే విషయంపై ఎటువంటి సమాచారం లేదు. సోమవారం మధ్యాహ్న సమయంలో జెరూసలెం సమీపంలో వరుస పేలుళ్ల శబ్దాలు వినిపించినట్టు మీడియావర్గాలు తెలిపాయి. అయితే, ప్రధాని కార్యాలయంపై ఇరాన్ దాడులు చేసిందన్న వార్తలను ఇజ్రాయెల్ ఖండించింది. ఇరాన్‌తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఆ దేశం ప్రయోగిస్తున్న క్షిపణులు, డ్రోన్లను తాము సమర్థవంతంగా అడ్డుకొంటున్నట్టు వెల్లడించింది. మరోవైపు, అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో గాయపడిన ఖమేనీ సతీమణి కూడా మరణించినట్టు ఇరాన్ మీడియా తెలిపింది. ఇంకోవైపు, ఇజ్రాయెల్-అమెరికా సంయుక్త దాడుల కారణంగా ఇరాన్లో ఇప్పటివరకూ 555 మంది మరణించినట్టు ది ఇరానియన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ ఒక ప్రకటనలో తెలిపింది. 131 నగరాలపై ఈ దాడులు జరిగినట్టు వెల్లడించింది. ఇదిలాఉండగా.. ఇరాన్‌పై దాడులకు అమెరికాతో కలిసి పని చేసేందుకు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ సంసిద్ధతను వ్యక్తం చేశాయి.
సౌదీ అరేబియాలోని అతి పెద్ద చమురు శుద్ధి కేంద్రాల్లో ఒకటైన అరామ్కో రిఫైనరీపై ఇరాన్ డ్రోన్ దాడులు జరిపింది. దీంతో ఈ కేంద్రం వద్ద భారీగా మంటలు చెలరేగాయి. ఫలితంగా రిఫైనరీని తాత్కాలికంగా మూసివేశారు. మరోవైపు, కువైట్‌లోని ఓ రిఫైనరీపై కూడా ఇరాన్ దాడి చేసినట్టు వార్తలు వచ్చాయి. ఇంకోవైపు, గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో చమురు నౌకపై ఓ డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటనలో భారత్‌కు చెందిన ఓ కార్మికుడు మృతి చెందినట్టు సమాచారం. చమురు రవాణాకు కీలకమైన హోర్మూజ్ జలసంధిలో నౌకల రవాణాను ఇరాన్ అడ్డుకోవడంతో చమురు ధరలు ఇప్పటికే 10 శాతం మేర పెరిగాయి. ఇప్పుడు ప్రధాన రిఫైనరీలపై దాడులు పెరుగుతుండటంతో చమురు ధరలు మరింత పెరిగే అవకాశమున్నదని వార్తలు వస్తున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఎల్ఎన్జీ (లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్) దిగ్గజం ఖతార్ ఎనర్జీ తన ఎల్ఎన్జీ ఉత్పత్తిని నిలిపేసింది.

ఇరాన్‌లోని అణు కేంద్రాలే లక్ష్యంగా అమెరికా-ఇజ్రాయెల్ దాడులు జరిపాయని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ)లోని ఇరాన్ రాయబారి రెజా నజాఫీ ఆరోపించారు. అయితే, ఈ దాడులు జరిగినట్టు ఎలాంటి ఆధారాలు లేవని యూఎన్ అణు నిఘా సంస్థ అధిపతి రాఫెల్ పేర్కొన్నారు. టెహ్రాన్‌లో ఇప్పటివరకూ రేడియేషన్ స్థాయిల్లో తేడా ఏమీలేదని తెలిపారు. అయితే, దాడులు కొనసాగుతుండటం వల్ల రేడియేషన్ లీకేజీని తోసిపుచ్చలేమని, దీంతో ఎప్పటికప్పుడూ అప్రమత్తంగా ఉంటున్నట్టు పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. యూఏఈ, బహ్రెయిన్‌లోని అమెజాన్ క్లౌడ్ యూనిట్ డాటా సెంటర్లలో కనెక్టివిటీ సమస్యలు కనిపించాయి. ఇరాన్ డ్రోన్ దాడుల కారణంగానే ఈ సమస్య తలెత్తిందా? అనే అనుమానాలు పెరిగాయి. అయితే, దీనిపై అమెజాన్ ఇంకా స్పందించలేదు.
ఇజ్రాయెల్ దాడుల్లో ఉత్తర టెహ్రాన్‌లోని గాంధీ దవాఖాన ధ్వంసమైంది. అయితే, అంతకు ముందే అక్కడి రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో ప్రాణనష్టం తప్పింది. ఈ ఘటనపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్ టెడ్రోస్ అధనోమ్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్యకు ప్రతీకారంగా ఆదివారం రాత్రి ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాలపై హెజ్బొల్లా దాడులు జరిపింది. ఈ మేరు హెజ్బొల్లాకు చెందిన అల్ మనార్ నెట్వర్క్ ఒక ప్రకటనలో తెలిపింది. దీనికి ప్రతిగా లెబనాన్ రాజధాని బీరుట్‌లోని హెజ్బొల్లా స్థావరాలపై సోమవారం ఉదయం ఇజ్రాయెల్ భీకర దాడులు జరిపింది. ఈ దాడుల్లో లెబనాన్ పార్లమెంట్‌లోని హెజ్బొల్లా బ్లాక్ అధిపతి మహ్మద్ రాడ్‌తో పాటు మరో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. 149 మంది గాయపడ్డారు. లెబనాన్‌ను హెజ్బొల్లా నాశనం చేస్తున్నదని, దానిని అడ్డుకోవడానికే ఈ ఉగ్రసంస్థలోని కీలక నేతలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులకు పాల్పడ్డట్టు ఇజ్రాయెల్ పేర్కొన్నది. హెజ్బొల్లా స్థావరాలపై మరిన్ని దాడులు చేపడుతామని, ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. దాడుల నేపథ్యంలో ప్రజలు స్కూల్స్, స్వచ్ఛంద సంస్థల్లో తలదాచుకొన్నారు. హెజ్బొల్లా కార్యకలాపాలపై నిషేధం విధిస్తున్నట్టు లెబనాన్ ప్రధాని నవాఫ్ సాలమ్ పేర్కొన్నారు. వెంటనే ఆయుధాలు అప్పగించాలని సూచించారు. ఖమేనీ తర్వాత తమ తదుపరి లక్ష్యం హెజ్బొల్లా చీఫ్ నయీమ్ కాజీమ్ అని ఇజ్రాయెల్ తెలిపింది. త్వరలో ఆయన్ని అంతమొందించనున్నట్టు ప్రకటించింది.

కువైట్‌లో సోమవారం మూడు అమెరికా యుద్ధ విమానాలు కూలిపోయాయి. తొలుత వీటిని ఇరాన్ పేల్చేసినట్టు వార్తలు వచ్చినా.. ఈ విషయంపై అమెరికా ఓ ప్రకటనను విడుదల చేసింది. కువైట్ డిఫెన్స్ ఫోర్సెస్ తమ మూడు యుద్ధ విమానాలను పొరపాటున (ఫ్రెండ్లీ ఫైర్) కూల్చివేసిందని యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. అయితే, ఈ ప్రమాదంలో ఆరుగురు సిబ్బంది క్షేమంగా బయటపడినట్టు వెల్లడించింది. ఈ ఆపరేషన్‌లో తమకు సహకారం అందిస్తున్నందుకు కువైట్ దళాలకు ధన్యవాదాలు తెలిపింది. అయితే, అమెరికా ప్రకటనను ఇరాన్ తోసిపుచ్చింది. ఆ యుద్ధ విమానాలను తామే పేల్చేసినట్టు తెలిపింది. మరోవైపు, కువైట్‌లోని అమెరికా ఎంబసీపై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. అంబులెన్స్‌లు, ఫైర్ ఇంజిన్లు ఆ ప్రాంతానికి చేరుకొన్నట్టు మీడియా పేర్కొన్నది. అయితే, ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు.